ఒక్కో యూనిట్​కు ముగ్గురికి పైగా పోటీ .. రాజీవ్​ యువ వికాసానికి 1,39,641 దరఖాస్తులు

ఒక్కో యూనిట్​కు  ముగ్గురికి పైగా పోటీ  .. రాజీవ్​ యువ వికాసానికి 1,39,641 దరఖాస్తులు

మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్​ యువ వికాస పథకానికి ఉమ్మడి మెదక్​ జిల్లాలో దరఖాస్తులు దండిగా వచ్చాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల పరిధిలో 42,511 యూనిట్లు మంజూరయ్యాయి. గడువు ముగిసే సరికి 1,39,641 దరఖాస్తులు వచ్చాయి.  ఒక్కో యూనిట్​కు ముగ్గురికి పైగా పోటీపడుతున్నారు. మండల, మున్సిపల్​ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయికి పంపిస్తారు. కలెక్టర్​ అధ్యక్షుడిగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు సభ్యులుగా ఉండే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ పరిశీలన జరిపి అర్హులైన వారిని రాజీవ్​ యువ వికాస పథకానికి ఎంపిక చేయనుంది. మే 20  లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్​ 2న లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. 

ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల తర్వాత

అనేక ఏండ్ల ఎదురు చూపుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం రాజీవ్​ యువ వికాసం పేరుతో  స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ పథకం కింద బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ శాఖల ద్వారా రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ,2 లక్షలు, రూ.4 లక్షల యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రుణాల మంజూరు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేస్తే తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. 

మొదటి ప్రాధాన్యత ఎవరికంటే..

రాజీవ్​ యువ వికాస పథకంలో నిస్సహాయులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇదివరకు ప్రభుత్వం నుంచి స్వయం ఉపాధి పథకానికి రుణం పొందని వారికి ప్రాధాన్యత ఇస్తారు. 

ఆటోకు దరఖాస్తు చేశా

నాకు డ్రైవింగ్​ వచ్చు. లైసెన్స్ ​కూడా ఉంది.  ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని చెప్పడంతో బీసీ కార్పొరేషన్​ కింద  ఆటో కోసం దరఖాస్తు చేశా. మంజూరైతే ఆటో కొనుగోలు చేసి దానిని నడుపుకుని ఉపాధి పొందుతాను.  - సాతెల్లి నరేశ్, నిరుద్యోగి, కొల్చారం

మే 20 లోపు ఎంపిక పూర్తి

రాజీవ్​ యువ వికాస పథకానికి మండల, మున్సిపల్​స్థాయిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి జిల్లా స్థాయికి పంపిస్తారు. కలెక్టర్ ​చైర్మన్​గా ఉన్న జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మే 20 లోగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జూన్​ 2న లబ్ధిదారులకు యూ‌‌‌‌నిట్ల మంజూరుకు సంబంధించిన పత్రాలు అందిస్తాం.- జమ్లానాయక్, మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీసర్, మెదక్ జిల్లా

సంగారెడ్డి జిల్లాలో..

శాఖ    దరఖాస్తులు
బీసీ    23,681
ఎస్సీ    14,480
ఎస్టీ    4,232
మైనార్టి    8,378
ఈబీసీ, ఈడబ్ల్యుఎస్    817
క్రిస్టియన్​ మైనార్టీ    9

సిద్దిపేట జిల్లాలో..

శాఖ    దరఖాస్తులు
బీసీ    36,225
ఎస్సీ    13,298
ఎస్టీ    2,010
మైనార్టీ    3,331
క్రిస్టియన్​    57

మెదక్ జిల్లాలో..

శాఖ    దరఖాస్తులు
బీసీ    20,238
ఎస్సీ    6,711
ఎస్టీ    3,884
మైనార్టీ    2,230