ఇజ్రాయెల్ సైన్యం క్యాంపులపై 200కు పైగా రాకెట్ల దాడి

ఇజ్రాయెల్ సైన్యం క్యాంపులపై 200కు పైగా రాకెట్ల దాడి
  •      తామే ప్రయోగించినట్లు ప్రకటించుకున్న హిజ్బుల్లా
  •      తమ సీనియర్ కమాండర్​ను చంపినందుకేనని వెల్లడి

లెబనాన్: ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 200కు పైగా రాకెట్లతో దాడి చేశామని లెబనాన్​కు చెందిన హిజ్బుల్లా టెర్రరిస్ట్ సంస్థ గురువారం ప్రకటించుకుంది. దక్షిణ లెబనాన్ ప్రాంతానికి నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా సీనియర్ కమాండర్​ను ఇజ్రాయెల్ సైన్యం చంపేసిందని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడ్డామని పేర్కొంది. అయితే, ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించలేదు. 

అనేక మిసైళ్లు తమ భూభాగంలోకి వచ్చాయని, అందులో చాలా రాకెట్లను తమ వైమానికి దళాలు పేల్చివేశాయని చెప్పింది. దీంతో ఇజ్రాయెల్​లోని చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయంది. తమపై దాడులు ఆగిపోయిన వెంటనే దక్షిణ లెబనాన్​లోని లాంచ్​పోస్ట్​లపై కౌంటర్ దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. 

పోయినేడాది అక్టోబర్​ 7న ఇజ్రాయెల్​పై హమాస్ దాడి, అనంతరం గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య తర్వాత నుంచి ఇజ్రాయెల్.. లెబనాన్ మధ్య గొడవలు పెరిగాయి. అప్పటినుంచి లెబనాన్​తోపాటు ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్​పై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈమధ్య కాలంలో అవి మరింత తీవ్రతరం అయ్యాయి. ఇజ్రాయెల్​కూడా ప్రతీకారం తీర్చుకుంటోంది.