ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్లు లక్ష్యంగా భద్రతా బలగాలు చేసిన వైమానిక దాడుల్లో 200 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని షెబెర్గాన్ నగరంలో తాలిబన్లు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్సెస్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో 200 మందికి పైగా తాలిబన్లు చనిపోగా.. 100కి వాహనాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా పెద్దమొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి కూడా పేలిపోయింది.
ఈ ఘటనను నిర్దారిస్తూ ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు. ‘శనివారం సాయంత్రం షెబెర్గాన్ నగరంలో 200 మందికి పైగా తీవ్రవాదులు మరణించారు. వారిని లక్ష్యంగా చేసుకొని B-52 బాంబర్ ద్వారా దాడి చేశాం. వైమానిక దాడుల ఫలితంగా వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు వారికి చెందిన వాహనాలు 100కి పైగా ధ్వంసమయ్యాయి’ అని ట్వీట్ చేశారు.