ఇంఫాల్: మణిపూర్ లోని ఇంఫాల్ లో వారం రోజుల క్రితం తప్పిపోయిన మైతీ తెగ వ్యక్తి కోసం ఇండియన్ఆర్మీ 2 వేల మంది సిబ్బంది గాలిస్తున్నారు. అస్సాంలోని కచార్ జిల్లాకు చెందిన లైష్రామ్ కమలబాబు సింగ్(56).. ఇంఫాల్ వెస్ట్‌లోని ఖుక్రుల్‌లో నివసించేవాడు. 57వ మౌంటైన్ డివిజన్‌లోని లీమాఖోంగ్ మిలిటరీ స్టేషన్‌లో వర్క్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
గత నెల 25న అతడు క్యాంప్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి మాత్రం చేరలేదు. ఆరోజు నుంచి కమల బాబు కనిపించకుండా పోయాడు. దీంతో వెంటనే అతని జాడ కనుగొనాలని మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో భారత సైన్యం సహాయంతో మణిపూర్ పోలీసులు కమలబాబు ఆచూకీ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 2 వేల ప్లస్ దళాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఆర్మీ ట్రాకర్ డాగ్‌లను ఉపయోగించి అతని జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.