
- 5.4% బడుల్లో టాయ్‌లెట్స్ లేవు..19% బడుల్లో పాడుబడ్డయ్
- 27 శాతం బాలికలకు టాయిలెట్ సౌలత్ లేదు
- ప్రభుత్వ, ప్రైవేట్ సూళ్ల పరిస్థితిపై అసర్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడుల్లో ‘టాయ్లెట్ల’ సమస్య కంటిన్యూ అవుతున్నది. ఒకటికి, రెంటికొస్తే బయటకు పోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇటీవల అసర్–2024 రిపోర్టు రిలీజ్ చేయగా, దాంట్లో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ఏకంగా నాల్గోవంతు బడుల్లో టాయ్ లెట్ల సమస్య ఉంది. ప్రైవేటు, సర్కారు బడుల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్ లెట్లు తప్పనిసరిగా నిర్మించాలని గతంలోనే సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ.. చాలా బడుల్లో అది అమలు కావడం లేదు. అసర్ నివేదిక ప్రకారం ఇప్పటికీ 5.4 శాతం బడుల్లో టాయ్ లెట్లు లేవని తేలింది. మరో 18.9 శాతం స్కూళ్లలో టాయ్లెట్లు ఉన్నా.. అవి విద్యార్థులు ఉపయోగించే స్థితిలో లేవు.
ఈ లెక్కన సుమారు 25 శాతం స్కూళ్లలో యూరిన్(ఒంటికి), లెట్రిన్ (రెంటికి) కు పోవాలంటే పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బయటకు పోవాల్సిన దుస్థితి నెలకొన్నది. హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో, జనావాసాల మధ్యనున్న బడుల్లో చదివే విద్యార్థులకు ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అమ్మాయిలు, అబ్బాయిలు నీళ్లు కూడా తాగడం లేదని పలు సర్వేల్లో తేలింది. అయినా అధికారులు మాత్రం స్పందించకపోవడం దారుణమేనని చెప్పారు. అయితే, 2010 సంవత్సరంలో టాయ్ లెట్స్ లేని స్కూళ్లు 23శాతం ఉండగా, ప్రస్తుతం అది ఐదుశాతానికి తగ్గింది. వాటి యూజ్ చేసే బడుల సంఖ్య కూడా 38శాతం నుంచి 75శాతానికి పెరిగింది.
మరోపక్క, అమ్మాయిలకు బడుల్లో ప్రత్యేకంగా టాయ్ లెట్స్ కరువయ్యాయి. అసర్ నివేదిక ప్రకారం 9.2 శాతం బడుల్లో స్పెషల్ గా లేవు. మహిళలకు ప్రత్యేకంగా ఉన్నా.. 4.4% బడుల్లో టాయ్ లెట్లు లాక్ చేసి ఉన్నాయి. 12.8 శాతం బడుల్లో ప్రత్యేక సదుపాయం ఉన్నా, అవి ఉపయోగించడం లేదని తేలింది. కాగా, 73శాతం బడుల్లోనే మహిళలకు ప్రత్యేకంగా టాయ్ లెట్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. 2010లో 53శాతం బడుల్లో అమ్మాయిలకు ప్రత్యేకంగా టాయ్ లెట్లు లేకపోగా, ప్రస్తుతం అది 9శాతానికి తగ్గింది.
రన్నింగ్ వాటర్ లేక..
చాలా బడుల్లో టాయ్ లెట్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు. దీంతో అవి వినియోగిం చుకోవడం ఇబ్బందికరంగా మారింది. టాయ్ లెట్లలో లైటింగ్ సౌకర్యమూ లేదు. ప్రస్తుతమున్న టాయ్ లెట్లు పలు బడుల్లో పిల్లల సంఖ్యకు అనుగుణంగా లేవు. కొన్ని బడుల్లో టాయ్ లెట్లు ఉన్నా.. అక్కడ కమోడ్ లు లేవు. దీంతో ముందుగా కొందరు వెళ్లిరాగానే.. ఆ పరిసరాలన్నీ గలీజ్ గా, అక్కడి నుంచి దుర్వాసన వస్తున్నది.
దీంతో వాటిలోకి వెళ్లేందుకూ పిల్లలు ఇష్టపడటం లేదు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద పెరిగింది.. అవి బాత్ రూమ్ పై రేకులను విరగ్గొడుతున్నాయి. దీనికితోడు బడుల్లో రాత్రిపూట బయటి వ్యక్తులు వచ్చి వాటిని ఇష్టానుసారంగా వాడుతూ, వాటిని పగలగొడుతున్నారని హెడ్మాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నవాటిలో నిర్వహణ లేకనే..
రాష్ట్రంలో టాయ్ లెట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడతో అవి ఉపయోగపడడం లేదు. గత ప్రభుత్వం హయాంలో స్కూళ్లు, టాయ్ లెట్లను శుభ్రం చేసేందుకు గానూ స్వచ్ఛకార్మికులను నియమించారు. కరోనా టైమ్ లో వారందరినీ తొలగించారు. వారి స్థానంలో నిర్వహణ బాధ్యతను అప్పటి ప్రభుత్వం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించింది. అయితే, స్కూళ్లలో పనిచేసేది తమ జాబ్ చార్ట్‌లో లేదని తాము చేయబోమని వాళ్లు బడుల్లోని పనులు చేయలేదు. దీంతో టాయ్ లెట్ల నిర్వహణ మూలనపడింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టులో స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా గ్రాంట్ రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా రూ.3వేల నుంచి రూ.20వేల వరకూ డబ్బులు ఇచ్చింది. అయితే, ఈ బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించి.. టాయ్ లెట్లు, స్కూళ్లను క్లీన్ చేయించడంతో పాటు, మొక్కల పెంపకానికి ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ కొన్ని స్కూళ్లకు పూర్తిస్థాయి నిధులు రాలేదు.