నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు
  • 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు
  • 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ 
  • తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం
  • 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ 
  • ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గురువారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5 వరకు జరిగే పరీక్షలన్నీ తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు ఆరున్నరేండ్ల తర్వాత మళ్లీ టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగగా, మొత్తం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.  వీరికి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. వీరి కోసం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ప్రతి రోజూ రెండు విడుతల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి11.30 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్‌‌‌‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ప్రతి షిఫ్ట్‌‌‌‌లో 13 వేల మందికి పైగా పరీక్షలు రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆన్‌‌‌‌లైన్ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోనున్నారు. ఎగ్జామ్ టైమ్ కంటే కనీసం గంటన్నర ముందే అభ్యర్థులు సెంటర్‌‌‌‌‌‌‌‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.

నిర్ణీత టైమ్ కంటే 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలను మూసివేస్తామని వెల్లడించారు. ఇప్పటికే బుధవారం సాయంత్రం వరకు 2,48,851 మంది అభ్యర్థులను వెబ్‌‌‌‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌‌‌‌లోడ్ చేసుకున్నారు. కాగా, తొలిరోజు గురువారం స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 

డబుల్ పోస్టులతో మెగా డీఎస్సీ..

గత సర్కారు 5,089 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో పరీక్షలు జరగాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల పేరుతో వాయిదా వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం 11,062 టీచర్లతో ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017 టీఆర్టీ ద్వారా 8,792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు జరిగాయి.