గ్రేటర్​లో 282 చెరువులు మాయం

  • కబ్జాలతో కుంచించుకుపోయిన మరో 209 చెరువులు 
  • యథేచ్ఛగా ఇండ్లు, ఫామ్‌హౌస్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌ల నిర్మాణం 
  • హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇవ్వాలంటున్న నిపుణులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకప్పుడు నీటితో కళకళలాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతీ చెరువును ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు శిఖం భూములు ఆక్రమించి విల్లాలు, ఫాంహౌస్​లు కట్టుకున్నారు. ఇలాంటివారి పట్ల గత ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. కబ్జాలతో హైదరాబాద్​చుట్టూ ఔటర్ రింగ్​రోడ్డు వరకు 282 చెరువులు మాయం అయిపోగా.. మరో 209 చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. 

జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలు, ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ ఏరియాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి.

920 చెరువుల్లో 491 కబ్జా 

జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా, వాటిలో 491 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇందులో 282 చెరువులు పూర్తిగా మాయం కాగా, మరో 209 చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. గ్రేటర్‌‌‌‌ పరిధిలో ముఖ్యంగా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌, నిజాంపేట, కొంపల్లి, జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, నాగారం, పీర్జాదిగూడ, పోచారం, మీర్‌‌‌‌పేట, జిల్లెలగూడ, బడంగ్‌‌‌‌పేట, జల్‌‌‌‌పల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌, దుండిగల్‌‌‌‌, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని తాజాగా ఆఫీసర్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్‌‌‌‌ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 13, మెదక్‌‌‌‌ జిల్లాలో10 చెరువుల శిఖం భూముల్లో గత పదేండ్లుగా రియల్‌‌‌‌ వ్యాపారాలు కొనసాగుతున్నా ఇన్నాళ్లూ రెవెన్యూ, ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

కమిటీ వేసినా.. చర్యలు తీసుకోలే  

హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో ఉన్న చెరువుల పరిరక్షణ, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌‌‌‌గా హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్ ను, సభ్యులుగా 18 శాఖల ఉన్నతాధికారులను నియమించారు. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2,540 చెరువులకు ప్రిమిలినరీ నోటిఫికేషన్లు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్‌‌‌‌ రీజియన్ (హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌) పరిధిలో 230 చెరువులకు సంబంధించి ఫైనల్‌‌‌‌ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేక్​ప్రొటెక్షన్​ కమిటీకి కావాల్సిన నిధులు, అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల రక్షణ కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. 

రోడ్ల మీదికి వరద.. కాలనీలే చెరువులు

చెరువులు కబ్జాలకు గురికావడంతో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి. కబ్జాలకు గురైన చెరువులు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. ఇండ్లకు ఇండ్లు మునిగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి భవిష్యత్‌‌‌‌లో పెను ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. వరదలను నివారించాలంటే ఆక్రమణలను తొలగించి చెరువులను కాపాడడం ఒక్కటే పరిష్కారం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రా పనితీరుపై నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల్లోని చెరువులను కాపాడేందుకు కూడా హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటుచేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.