
- ఒక్క ఎప్సెట్కే 2.99 లక్షలకు పైగా దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి ఎనిమిది సెట్లకు (ఎప్‌సెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్) కలిపి 3,65,325 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో అత్యధికంగా ఎప్‌సెట్‌కు 2,99,594 దరఖాస్తులు రాగా.. దీంట్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు 2,15,436, అగ్రికల్చర్ స్ర్టీమ్‌కు 83,916, రెండింటికి కలిపి 242 అప్లికేషన్లు వచ్చాయి. అయితే, ఇప్పటికే ఎప్‌సెట్ కు ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 4తో ముగియడంతో ప్రస్తుతం ఈ నెల 24వరకూ ఫైన్‌తో అప్లై చేసుకునే చాన్స్ ఉంది. మరోపక్క టీజీ ఈసెట్‌కు ఇప్పటి వరకూ 15,516 , ఐసెట్ కు 15,582, పీజీఈసెట్ కు 3,979, ఎడ్ సెట్ కు 10,486, పీఈసెట్ కు 635 దరఖాస్తులు వచ్చాయి.
మూడేండ్ల లాసెట్ కు 13,870, ఐదేండ్ల కోర్సుకు 4,125, ఎల్ఎల్ఎంకు 1,544 అప్లికేషన్లు అందాయి. కాగా, ఈసెట్‌కు ఈనెల 19 వరకూ దరఖాస్తుకు అవకాశం ఉండగా, ఐసెట్ కు మే 17 వరకూ, పీజీఈసెట్ కు మే 19, ఎడ్ సెట్ కు మే 18 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. పీజీఈసెట్ కు ఈనెల 15తో దరఖాస్తు గడువు ముగియనుండగా, పీఈసెట్ కు మే 24 వరకూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.