
చైనాలో ప్రకృతి విపత్తు. నార్త్ చైనా షాంగ్జీ ప్రావిన్స్ లోని లింగ్చువాన్ కౌంటీలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. శనివారం నాడే ఈ మంటలు అంటుకోగా.. బలమైన ఈదురుగాలులు, ఎండ తీవ్రత కారణంగా.. ఇది కార్చిచ్చుగా మారింది. 2025, ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నాటికి.. ఈ మంటలు లింగ్చువాన్ ఏరియాలోని లియుక్వాన్ టౌన్ షిప్ కు వ్యాపించాయి. ఈ టౌన్ షిప్ లోని ఇళ్లను మంటలు బూడిద చేస్తున్నాయి. ఇప్పటికే 250 ఇళ్లల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది.
ఈ కార్చిచ్చుపై చైనా ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. సమీపంలోని ఇన్నర్ మంగోలియా రీజియన్ నుంచి అగ్నిమాపక సిబ్బందిని, రెస్క్యూ టీంలను తరలించారు. స్థానిక అధికారులు, ప్రజలతో మొత్తం 3 వేల మందిని సహాయ చర్యలకు నియమించారు అధికారులు. ఐదు హెలికాఫ్టర్లను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
►ALSO READ | China Vs US: అమెరికాకు చైనా ఝలక్.. బోయింగ్ జెట్ డెలివరీస్ నిలిపివేత..!
లింగ్చువాన్ అడవులు దట్టంగా ఉంటాయని.. మండే స్వభావం ఉన్న చెట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు స్థానిక అధికారులు. దీంతో మంటలను అదుపు చేయటం అనేది సాధ్యం కావటం లేదని.. గంట గంటకు మంటల వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. లియుక్వాన్ టౌన్ షిప్ అనేది పూర్తిగా బూడిదగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. టౌన్ షిప్ లోని అందర్నీ ఖాళీ చేయించే ఆలోచనలో స్థానిక అధికారులు ఉన్నట్లు చైనా మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉందని.. ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు అధికారులు. మంటలను అదుపు చేయటానికి 3 వేల మందిని నియమించారు అంటేనే.. ఇది ఎంత పెద్ద కార్చిచ్చునో అర్థం అవుతుంది. మొన్నటికి మొన్న అమెరికాలో లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలిసింది.. ఇప్పుడు నార్త్ చైనాలోనూ అలాంటి ప్రమాదమే అంటున్నారు.