- అమలు విషయంలో తేడా సరిదిద్దాలని డిమాండ్
- ఏడేండ్లుగా పెండింగ్ పెడుతూ వస్తున్న యాజమాన్యాలు
కోల్బెల్ట్, వెలుగు: బొగ్గు గని ఆఫీసర్లు, ఇతర ఉద్యోగుల మధ్య గ్రాట్యుటీ చెల్లింపు తేదీల్లో తేడాతో 4వేల మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు అన్యాయం జరిగింది. రూ.10 లక్షల చొప్పున తాము నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వివిధ కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2016లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.10 లక్షలు ఉన్న గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచుతూ బిల్లును ఆమోదించింది.
దీని ప్రకారం బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిర్ణయించారు. కోలిండియాతో పాటు సింగరేణిలో పని చేస్తున్న ఆఫీసర్లు, కార్మికులకు పెంచిన గ్రాట్యుటీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంపెంచిన రూ.20 లక్షల గ్రాట్యుటీని సింగరేణిలో పని చేస్తున్న ఆఫీసర్లకు 2017, జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కార్మికులకు మాత్రం 2018 మార్చి 28 నుంచి పెంచిన గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. దీంతో 2017 జనవరి 1 నుంచి 2018 మార్చి 28 మధ్య రిటైర్ అయిన 4 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పెంచిన రూ.10 లక్షల అదనపు గ్రాట్యుటీని పొందలేకపోయారు.
ఆఫీసర్లు, ఉద్యోగులకు గ్రాట్యుటీ అమలులో వేర్వేరుగా తేదీలను ప్రకటించడంతో 14 నెలల కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు పెంచిన గ్రాట్యుటీని కోల్పోయారు. 4 వేల మంది రూ.10 లక్షల చొప్పున రూ.400 కోట్లు కోల్పోయారు. బొగ్గు గని కార్మికుల పదో వేతన సవరణ 2016, జులై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా.. దీనిపై 2017, అక్టోబర్ 1న ఒప్పందం కుదిరింది. గ్రాట్యుటీ మాత్రం 2018, ఫిబ్రవరి తర్వాత అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆఫీసర్ల వేతన సవరణ 2017, జనవరి నుంచి అమలు కావడంతో అప్పటి నుంచే పెంచిన గ్రాట్యుటీని వారికి వర్తింపజేస్తున్నారు. ఆఫీసర్లకు వేతన సవరణ తేదీ నుంచి గ్రాట్యుటీ అమలు చేస్తూ.. కార్మికులకు వేతన సవరణతో సంబంధం లేకుండా వర్తింపజేయడంతో ఆర్థికంగా నష్టపోయారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
ఏడేండ్లుగా అడుగుతున్నా..
బొగ్గు గని ఆఫీసర్లు, ఇతర ఉద్యోగుల మధ్య గ్రాట్యుటీ చెల్లింపు తేదీల్లో తేడాను సరి చేసి తమకు న్యాయం చేయాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెంచిన గ్రాట్యుటీ చెల్లింపు తేదీని వేర్వేరుగా నిర్ణయించడాన్ని అప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఏడేండ్లుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంగ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచుతూ 2018లో బిల్లు తేగా, పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని అమలుపై బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలు ఒక తేదీని ఖరారు చేశాయి. అయితే ఆఫీసర్లకు ఒక తేదీ, ఉద్యోగులు, కార్మికులకు మరో తేదీని నిర్ణయించారు.
ఉద్యోగులు, కార్మికులు 14 నెలలు నష్టపోయేలా అమలు తేదీని ఖరారు చేశారు. దీంతో ఆ సమయంలో రిటైర్ అయిన 4వేల మంది కార్మికులు, ఉద్యోగులు రూ.10 లక్షల చొప్పున నష్టపోయారు. అప్పటి నుంచి అనేక సార్లు జాతీయ కార్మిక సంఘాలు జేబీసీసీఐ ఆపెక్స్ కమిటీ, స్టాండరైజేషన్ కమిటీ మీటింగ్లో బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకవస్తున్నా ఫలితం కానరావడం లేదు. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు నష్టపోయిన రిటైర్డ్ కార్మికులకు పెంచిన గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి.
ఐదేండ్లు పని చేస్తే గ్రాట్యుటీ..
అన్ని సంస్థల్లో పర్మినెంట్ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. ఇందులో భాగంగా సీఎంపీఎఫ్(ఈపీఎఫ్)తో పాటు గ్రాట్యుటీ ప్రత్యేక సంక్షేమ పథకంగా 1972లో అమల్లోకి వచ్చింది. ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలో పర్మినెంట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ నిరంతరాయంగా ఐదేళ్లు కొనసాగితే గ్రాట్యుటీకి అర్హులవుతారు. ఉద్యోగి విరమణ రోజే అన్ని చెల్లింపులు పూర్తి చేసి, నెలలోగా(30 రోజుల్లో) గ్రాట్యుటీ ఇవ్వాలనే నిబంధన ఉంది. సింగరేణి యాజమాన్యం కార్మికుడికి కేటాయించిన క్వార్టర్ను రిటైర్ అయ్యాక ఆరు నెలల తర్వాత సంస్థకు అప్పగిస్తే గ్రాట్యుటీ చెల్లిస్తారు.
ఇదిలా ఉంటే క్వార్టర్ ఖాళీ చేయకపోతే పీనల్ రెంట్ పేరుతో వసూలు చేస్తున్న యాజమాన్యం, గ్రాట్యుటీ రూ.20 లక్షలపై మాత్రం వడ్డీ చెల్లించడంలేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరుగుతున్నా సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో కొందరు ఆర్ఎల్సీని ఆశ్రయించగా, మరికొందరు కోర్టులో కేసులు వేశారు. రిటైర్డ్ కార్మికులకు పెంచిన రూ.20 లక్షల గ్రాట్యుటీని ఇప్పించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.