- సుమారు 50 వేల కార్లను అమ్మిన మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి
- రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువున్న కార్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీలకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ప్రతి గంటకు ఆరు కార్లను అమ్మగలిగాయి. రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువున్న కార్ల సేల్స్ ఊపందుకున్నాయి. కొత్త ఏడాదిలో కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ బాగుంటుందని, చాలా కంపెనీలు కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 50 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఏడాది ఆటో ఇండస్ట్రీ 8–10 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లన్ అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత లగ్జరీ కార్ల మార్కెట్ నెమ్మదిగా పుంజుకుందని, తాజాగా పీక్ లెవెల్‌కు చేరుకుందని వివరించారు.
కాగా, ఇండియాలో లగ్జరీ కార్ల అమ్మకాలు మొదటిసారిగా ఈ ఏడాదే 50 వేల మార్క్‌ను టచ్ చేశాయి. వచ్చే ఏడాది సుమారు 52,000–53,000 లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ బాగుందని, కొత్త సంవత్సరంలోనూ సేల్స్ నిలకడగా ఉంటాయని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. బెంజ్ 2024 కి సంబంధించిన సేల్స్ డేటాను జనవరిలో ప్రకటించనుంది.
ఈ కంపెనీ 20 వేల కార్లను ఈ ఏడాదిలో అమ్మిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇండియా లగ్జరీ కార్ల మార్కెట్‌లో బెంజ్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి తొమ్మిది నెలల్లోనే కంపెనీ సేల్స్ 14,379 బండ్లకు చేరుకున్నాయి. 2023 లోని ఇదే టైమ్‌తో పోలిస్తే 13 శాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో కూడా ఇలాంటి పనితీరునే కనబరుస్తామని అయ్యర్ పేర్కొన్నారు. కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని అన్నారు. బీఎండబ్ల్యూ ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 10,556 బండ్లను అమ్మగలిగింది. ఏడాది ప్రాతిపదికన 5 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఆడి ఇండియా సేల్స్ ఈ ఏడాది 16 శాతం పెరుగుతాయని అంచనా.
పెరుగుతున్న బిలియనీర్లు..పెరుగుతున్న సేల్స్
ఇండియాలో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో లగ్జరీ కార్ల వాటా ఒక శాతంగా ఉంది. ఇతర పెద్ద ఎకానమీలతో పోలిస్తే ఇండియాలోనే లగ్జరీ కార్ల మార్కెట్ వాటా తక్కువగా ఉంది. యూఎస్, చైనా తర్వాత ఎక్కువగా బిలియనీర్లు ఇండియాలో ఉన్నారు. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, 2028 నాటికి ఇండియాలో ధనవంతులు (రూ.255 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు) 19,908 కి చేరుకోనున్నారు. 2023 లో నమోదైన 13,263 మందితో పోలిస్తే 50 శాతం పెరుగుతారని అంచనా. ఇదే టైమ్‌లో చైనా, టర్కీ, మలేషి యాలోనూ ధనవంతులు ఎక్కువగా పెరగనున్నారు. దీంతో ఇండియా లగ్జరీ కార్ల మార్కెట్‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని తెలిపాయి.