ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు బుధవారంతో ముగిసింది. కాగా బుధవారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు 7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. వీటిలో 50 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయని చెప్పింది. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
ఈ స్థాయిలో రిటర్నులు దాఖలు అయినందుకు పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ధన్యావాదాలు తెలిపింది. గతేడాది జూలై 31 వరకు 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 7 కోట్లు దాటిందని పేర్కొంది. కాగా జూలై 31, 2024 లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారు డిసెంబర్ 31 వరకు రిటర్న్‌లను దాఖలు చేయవచ్చని పేర్కొంది. కానీ అందుకు రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.