
- మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు 91%
- వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు
- కరీంనగర్‌కు బ్యాలెట్ బాక్సులు
- బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్.. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు
- 2019తో పోలిస్తే భారీగా పెరిగిన పోలింగ్ శాతం
- మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు 91%
- వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు
కరీంనగర్/నల్లగొండ, వెలుగు: మెదక్ -కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్, -నిజామాబాద్-, కరీంనగర్,- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70.42 శాతం ఓటింగ్ నమోదైంది. 3,55,159 మంది ఓటర్లుంటే.. 2,50,106 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 91.90 శాతం పోలింగ్ రికార్డయింది. మొత్తం 27,088 మంది టీచర్లలో 24,895 మంది ఓటేశారు.
అలాగే.. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 93.55 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 25,797 మంది టీచర్లుంటే.. 24,133 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే అటు గ్రాడ్యుయేట్లు, ఇటు టీచర్లు ఓటేసేందుకు తమ తమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్స్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 93 కామన్ పోలింగ్ స్టేషన్లు(గ్రాడ్యుయేట్స్, టీచర్స్) ఉన్నాయి. మొత్తంగా 15 జిల్లాల్లోని 773 పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచారు. అంబేద్కర్ స్టేడియంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటల బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు స్థానాల ఓట్లను మార్చి 3వ తేదీన లెక్కించనున్నారు. బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పోలింగ్ పర్సంటేజీకరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ పర్సంటేజీ పెరిగింది.
2019లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,95,581 మంది ఓటర్లకుగాను 1,15,359 మంది (59.30 శాతం) మాత్రమే ఓటేశారు. 80,222 మంది గ్రాడ్యుయేట్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 3,55,159 మంది ఓటర్లకుగాను- 2,50,106 (70.42శాతం) మంది గ్రాడ్యుయేట్లు ఓటేశారు. గత ఎన్నికలతో పోలిస్తే 10.50 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. అలాగే, 2019 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23,160 మంది టీచర్లకుగాను 19,349 మంది (83.54 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి ఇదే టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది టీచర్లకుగాను 24,895 (91.90 శాతం) మంది ఓటేశారు.