- 8 మంది ఇరాన్ దేశస్తుల అరెస్టు
న్యూఢిల్లీ: గుజరాత్ సముద్ర తీరంలో 7 క్వింటాళ్ల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేస్తున్న 8 మంది ఇరాన్ దేశస్తులను అరెస్టు చేశారు. సముద్రం గుండా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నదని సమాచారం అందడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), నేవీ, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. దీనికి ‘సాగర్ మంథన్–4’ అని పేరు పెట్టారు. పోరుబందర్ తీరంలో గురువారం అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మన సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఓ బోటును పట్టుకున్నారు.
అందులో తనిఖీలు చేయగా 7 క్వింటాళ్ల మెథాంఫెటమైన్ అనే డ్రగ్ దొరికింది. దాన్ని సీజ్ చేశారు. అదే బోటులో ఉన్న 8 మంది ఇరాన్ దేశస్తులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ విలువ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే దానిపై నిందితులను విచారిస్తున్నారు.
టెర్రర్ యాక్టివిటీలకు ఫండింగ్ కోసం పాకిస్తానే బార్డర్ వెంట డ్రగ్స్ ను సప్లై చేస్తున్నదన్న రిపోర్టుల నేపథ్యంలో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ పట్టుకున్న అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. డ్రగ్ ఫ్రీ భారత్ కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.