వాషింగ్టన్, డీసీ: అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఆ దేశం నుంచి పంపించేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఆయన అధ్యక్ష పీఠమెక్కిన వారం రోజుల వ్యవధిలోనే 7,300 మంది వలసదారులను ట్రంప్ ఆదేశాలతో అమెరికా నుంచి పంపించేశారు. ఆ వలసదారుల చేతులకు సంకెళ్లేసి యూఎస్ ఆర్మీ విమానాల్లో తరలిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము క్రిమినల్స్ కాదని, ఉపాధి కోసమే అమెరికాకు వెళ్లామని.. ఇలా చేతులకు బేడీలు వేయడం ఏంటని వలసదారులు నిలదీస్తున్నారు.
మానవ హక్కుల సంఘాలు కూడా ట్రంప్ తరిమికొడుతున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇలా అమెరికా తరలిస్తున్న వలసదారుల్లో ఎక్కువగా బ్రెజిల్ దేశానికి చెందిన పౌరులే ఉన్నారు. మిలటరీ విమానాల్లో చేతులకు సంకెళ్లు వేసి తమ పౌరులను తరలించడంపై వివరణ ఇవ్వాలని అమెరికాను బ్రెజిల్ డిమాండ్ చేసింది. ఈ వారం రోజుల్లోనే అమెరికా మిలటరీ విమానాల్లో వేల సంఖ్యలో వలసదారులను తరలించారు.
కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం టారిఫ్ వేస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో అక్రమ వలసదారులు రాకుండా, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు చెక్ పెట్టడానికి ఆ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ జరగకుండా కెనడా, మెక్సికో దేశాలు చర్యలు తీసుకోవడం లేదని, అందుకు మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. చైనా కూడా తమ దేశం నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టడం లేదని, అందుకే ఆ దేశంపైనా అదనపు సుంకం విధిస్తానన్నారు.
ALSO READ | ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో ఐటీ రద్దు?!
అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వ్యక్తులు, కుటుంబాల ఆదాయం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి అమెరికన్ తన కనీస అవసరాలు, ఈఎంఐలు వంటి వాటి కోసం ఖర్చు చేశాక మిగిలిన ఆదాయాన్ని (డిస్పోజబుల్ ఇన్కమ్) పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని కోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్‌పై అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అమెరికాను అడ్డం పెట్టుకుని చాలా దేశాలు లాభాలు పొందుతున్నాయన్నారు.