ఒకే సారి 80 బాంబులతో దాడి.. 6 భవనాలు క్షణాల్లో నేలమట్టం

ఒకే సారి 80 బాంబులతో దాడి.. 6 భవనాలు  క్షణాల్లో నేలమట్టం
  • 80 బాంబులతో 6 భవనాలు  క్షణాల్లో నేలమట్టం
  • కీలక సమావేశం జరుగుతుండగా దాడి
  • హెజ్బొల్లా టాప్ కమాండర్,నస్రల్లా కూతురు కూడా మృతి
  • సేఫ్ ప్లేస్​కు వెళ్లిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

టెల్ అవీవ్/బీరుట్: ఇరాన్ అండతో లెబనాన్ గడ్డపై నుంచి ఏడాది కాలంగా ఇజ్రాయెల్ పైకి తరచూ రాకెట్లు ప్రయోగిస్తూ దాడులు చేస్తున్న హెజ్బొల్లా టెర్రరిస్ట్ సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ను నాశనం చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన హెజ్బొల్లాను మూడు దశాబ్దాలుగా నడిపిస్తూ వస్తున్న ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత చీఫ్ హసన్ నస్రల్లా(64)ను ఇజ్రాయెల్ ఆర్మీ మట్టుబెట్టింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్ లోని హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్ లో నస్రల్లా కీలక కమాండర్లతో సమావేశం నిర్వహిస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఒకేసారి 80 బాంబులను ప్రయోగించింది. ఒక్కో బాంబు ఒక్కో టన్ను పేలుడు పదార్థంతో కూడి ఉన్నాయని, ఆ బాంబుల ధాటికి క్షణాల్లోనే ఆరు భవనాలు నేలమట్టం అయిపోయాయని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో హసన్ నస్రల్లాతోపాటు ఆయన కూతురు జైనాబ్ నస్రల్లా, హెజ్బొల్లా సదర్న్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, పలువురు అడిషనల్ కమాండర్లు కూడా హతమయ్యారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ షోషానీ ప్రకటించారు. ‘‘ఎన్నో ఏండ్లుగా నస్రల్లా కదలికలను నిరంతరం గమనిస్తూ వస్తున్నాం. శుక్రవారం పక్కా సమాచారంతో దక్షిణ బీరుట్​లోని హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్​లో ఆ సంస్థ నాయకులు సమావేశమయ్యారని గుర్తించి ఎయిర్ స్ట్రైక్ చేశాం” అని ఆయన వెల్లడించారు.

గాజా తరహాలో భూతల దాడికి సిద్ధం  

హెజ్బొల్లా వద్ద ఇప్పటికీ పెద్ద ఎత్తున రాకెట్లు, మిసైల్స్, ఆయుధాలు ఉన్నాయని, అందువల్ల ఇంకా ముప్పు తొలగిపోలేదని షోషానీ తెలిపారు. నస్రల్లా హత్యకు ప్రతీకారంగా హెజ్బొల్లా తీవ్ర స్థాయిలో దాడులు చేయొచ్చని, అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. నస్రల్లా అంతంతో తమ పోరాటం ముగిసిపోలేదని, దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ ప్రకటించారు. కాగా, గాజా తరహాలో లెబనాన్​లోని హెజ్బొల్లా స్థావరాలను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

పవిత్ర యుద్ధం ఆగదు: హెజ్బొల్లా 

బీరుట్​పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆరు అపార్ట్ మెంట్ బిల్డింగ్స్ నేలమట్టం అయ్యాయని, ఆరుగురు చనిపోగా, 91 మంది గాయపడ్డారని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. నస్రల్లా మృతిని హెజ్బొల్లా కూడా శనివారం ధ్రువీకరించింది. ‘‘నస్రల్లా తన సహచర అమరులతో జత కలిశారు” అని ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా, శత్రువుపై పవిత్ర యుద్ధం కొనసాగుతుందని పేర్కొంది. 

హెజ్బొల్లాకు మద్దతివ్వండి: ఖమేనీ  

బీరుట్​లో హెజ్బొల్లా చీఫ్​ను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హెజ్బొల్లాకు ఇరాన్  అన్ని రకాలుగా అండగా ఉంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. అయితే, శనివారం ప్రభుత్వ టీవీ ద్వారా ఖమేనీ వీడియో మెసేజ్ ఇచ్చారు. హెజ్బొల్లాకు ప్రాంతీయ రెసిస్టెన్స్ గ్రూపులన్నీ మద్దతివ్వాలని ఖమేనీ పిలుపునిచ్చారు. 
 
కొనసాగుతున్న దాడులు 

ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మధ్య శనివారం కూడా దాడులు కొనసాగాయి. బీరుట్, బెకా వ్యాలీ సహా పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ 140కిపైగా వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్​వైపు హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా పదులకొద్దీ రాకెట్లను ప్రయోగించారు. వారం రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లెబనాన్​లో 720 మంది చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు ప్రారంభించింది. దాంతో హమాస్ కు మద్దతుగా లెబాన్ నుంచి ఇజ్రాయెల్​పై హెజ్బొల్లా దాడులు చేస్తోంది. తరచూ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య దాడులు కొనసాగుతుండటంతో ఏడాది కాలంగా బార్డర్​లో ఇజ్రాయెల్ వైపు దాదాపు 60 వేల మంది.. లెబనాన్ వైపు 2 లక్షల మంది తమ ఊర్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

కూరగాయల వ్యాపారి కొడుకు నుంచి హెజ్బొల్లా చీఫ్​గా..

హసన్ నస్రల్లా 1960లో బీరుట్​లో ఓ సాధారణ కూరగాయల వ్యాపారి కుటుంబంలో జన్మించాడు. 9 మంది సంతానంలో ఇతడే పెద్దవాడు. నస్రల్లా 16 ఏండ్ల వయసులోనే 1975లో అమల్ మూమెంట్ అనే షియా మిలిటెంట్ సంస్థలో చేరాడు. ఏడేండ్ల తర్వాత..1982లో పాలస్తీనియన్ మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ ను ప్రతిఘటించే విషయంలో భేదాభిప్రాయాల కారణంగా నస్రల్లా.. అమల్ సంస్థలోని కొందరితో కలిసి బయటకు వచ్చి ఇస్లామిక్ అమల్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా పేరుతో షియా మిలిటెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. ‘‘ముస్లింల భూములను ఆక్రమించినందున ఇజ్రాయెల్ ను నాశనం చేయడమే తమ లక్ష్యం’’ అంటూ ఈ సంస్థ 1985లో అధికారికంగా ప్రకటించుకుంది. అయితే, 1992లో అప్పటి హెజ్బొల్లా చీఫ్ అబ్బాస్ అల్ ముసావీని ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ తో మట్టుబెట్టడంతో నస్రల్లా 32 ఏండ్ల వయసులోనే హెజ్బొల్లా చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా హెజ్బొల్లాను నడుపుతూ బలమైన టెర్రరిస్ట్ సంస్థగా మార్చాడు. గతంలో పలు సార్లు ఇజ్రాయెల్ దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్న నస్రల్లా కొన్నేండ్లుగా బహిరంగంగా తిరగకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. చివరకు హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్ లోనే హతమయ్యాడు.