
ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరాలంటే బస్సు డ్రైవరుపైనే భారమంతా. వాళ్లు మంచిగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, ఆర్టీసీలో డ్రైవర్లపై భారం నానాటికీ పెరుగుతోంది. కారణం, పని ఒత్తిడి. ఏళ్లు గడుస్తున్నా డ్రైవర్ రిక్రూట్ మెంట్లు చేయకపోవడం, డ్రైవర్ల కొరత ఉండడంతో ఉన్నవారిపైనే అదనపు పనిభారం పడుతోంది. సెలవులూలేకుండా పనిచేస్తుండటంతో డ్రైవింగ్‌లోనే ప్రాణాలు వదులుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ముగ్గురు డ్రైవర్లు ఇలానే ప్రాణాలు విడిచారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 10,200 బస్సులున్నాయి. రాష్ట్రం వచ్చాక24 వేల మంది డ్రైవర్లున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అందులో ఇప్పటికే 2 వేల నుంచి 5 వేల మంది వరకు రిటైర్ అయినట్టు తెలుస్తోంది. అయినా కూడా వారిస్థానంలో కొత్త వారిని తీసుకోలేదు. ఎనిమిదేళ్లుగా రిక్రూట్మెంట్ మాటే లేదు. ఇటు డ్రైవర్ల కన్నా కండక్టర్ల సంఖ్యే ఎక్కువుంది.
12 నుంచి 15 గంటల డ్యూటీ
డ్రైవర్లు తక్కువగా ఉండటంతో ఉన్నవారిపైనే భారం ఎక్కువవుతోంది. టిమ్ పేరిట డ్రైవర్లే కండక్టర్ డ్యూటీలు చేస్తుండటం, కేఎంపీఎల్ (మైలేజీసామర్థ్యం పెంపు)పై అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో భారం పడుతోంది. మోటారు వాహన చట్టం ప్రకారం జిల్లాల్లో 8 గంటలు, నగరాల్లో 7 గంటలే పనిచేయాలి. కానీ సిబ్బంది తక్కువగా ఉండటంతో12 నుంచి 15 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి. జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, సెలవుల్లేకుండా పనిచేస్తున్నామని, సెలవు తీసుకుంటే ఆబ్సెంట్ కింద జీతంలో కోత పెడుతున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. దీంతో డ్రైవర్లకు సరైన నిద్రలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఒత్తిడి వల్ల స్టీరింగ్ పైనే డ్రైవర్లు చనిపోతున్నారని యూనియన్ నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం నల్లగొండ డిపోకు చెందిన ఓ డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పైనే కన్నుమూసిన ఘటనను గుర్తు చేశారు. నిజానికి రిటైర్మెంట్ రోజు డ్యూటీ వేయరని, కానీ, డ్రైవర్ కొరత ఉండడంతో ఆ రోజు ఆయనకు డ్యూటీ వేశారని చెబుతున్నారు.
ఇటీవల నిర్మల్ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, హైదరాబాద్‌లో ఫలక్ నుమా బస్ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గుండె పోటుతోచనిపోయినట్టు యూనియన్ నేతలు చెప్పారు. ఇలా ఆరు నెలల్లో 30 మంది దాకా ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయినట్టు చెబుతున్నారు. రెగ్యులర్ డ్రైవర్ చనిపోతే అతడి కుటుంబంలో అర్హులకు ఉద్యోగంతో పాటు 20వేలు అంతిమ సంస్కారాలకు ఇస్తారు. కానీ, కాంట్రాక్ట్ డ్రైవర్లు చనిపోతే ₹20 వేలతో సరిపెడుతున్నారు.ఆర్టీసీపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. గతేడాది బడ్జెట్ లో ఆర్టీసీకి ₹960 కోట్లు ప్రకటించినా ₹560 కోట్లే ఇచ్చారని,ఈసారి ఆ ఊసే లేదంటున్నారు. సంస్థలో ఇన్చార్జిపాలన నడుస్తుండటంతో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. చైర్మన్, ఎండీ, ఈడీ, కింది స్థాయి అధికారులూ లేకుండా సంస్థను నెట్టు కొస్తున్నారు.
మేనేజ్ మెంటే బాధ్యత వహించాలి
డ్రైవింగ్ లో డ్రైవర్లు చనిపోతే మేనేజ్ మెంటేబాధ్యత తీసుకోవాలి. 6 నెలల్లో 30 మందివరకు చనిపోయారు. చట్ట వ్యతిరేకంగాడ్రైవర్లతో పనిచేయిస్తు న్నారు. లీవ్ లు అడిగితేఇవ్వడం లేదు. అత్యవసరం వచ్చి సెలవుతీసుకుంటే జీతం కట్ చేస్తు న్నారు. రద్దీకిఅనుగుణంగా బస్సులు నడపట్లేదు.కాంట్రాక్ట్ డ్రైవర్ చనిపోతే కూడా వారికుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
– హనుమంతు,ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ
దాడి చేస్తున్నారు
డ్రైవర్లు లేక వందల బస్సులునిలిచిపోయాయి. ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. స్టాపుల్లో ఆపకపోతుంటేదాడి చేస్తు న్నారు. కేసులూ నమోదయ్యాయి. వెంటనే డ్రైవర్ పోస్టు లు భర్తీ చేయాలి.
– విక్రమ్, డ్రైవర్, కాచిగూడ డిపో
పని భారం పెరుగుతోంది
ఏళ్లుగా డ్రైవర్ పోస్టు లను భర్తీ చేయలేదు.ప్రతి నెలా వందల మంది డ్రైవర్లు రిటైర్అవుతున్నారు. ఉన్నోళ్లపైనే భారంపడుతోంది. 12 నుంచి 14 గంటలుపనిచేస్తున్నాం . సెలవులూ ఇవ్వట్లేదు.
– సి.రాములు, పరిగి డిపో