ఇంటర్ బోర్డులో సగానికిపైగా పోస్టులు ఖాళీ.. లెక్చరర్లతో పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు

ఇంటర్ బోర్డులో సగానికిపైగా పోస్టులు ఖాళీ.. లెక్చరర్లతో పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డులో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇతర పోస్టుల్లో పనిచేస్తున్న వారితో అధికారులు పనులు చేయించుకుంటున్నారు. ఇటీవల హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో ఖాళీల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో మొత్తం 236 పోస్టులు శాంక్షన్ కాగా, దీంట్లో ప్రస్తుతం 97 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 139 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 

 హైదరాబాద్ హెడ్డాఫీసులో 158 పోస్టులకు 57 మంది మాత్రమే పనిచేస్తుండగా, 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆఫీసుల్లో 78 శాంక్షన్ పోస్టులు ఉండగా, 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రస్తుతం 50 మందికి పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 30 వరకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆఫీసుల్లో సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతున్నది. మరోపక్క జిల్లా ఆఫీసులు, కాలేజీల్లో పనిచేసే సిబ్బందిని, లెక్చరర్లను బోర్డులో ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం గ్రూప్ 3 ద్వారా కొన్ని పోస్టులు భర్తీ అవుతాయని బోర్డు వర్గాలు చెప్తున్నాయి.