మనోళ్లు వెయ్యి మందికి పైగా తిరిగొచ్చారు.. 800 మందికిపైగా స్వదేశానికి వెళ్లిపోయిన పాకిస్తానీయులు

మనోళ్లు వెయ్యి మందికి పైగా తిరిగొచ్చారు.. 800 మందికిపైగా స్వదేశానికి వెళ్లిపోయిన పాకిస్తానీయులు

లాహోర్: జమ్మూకాశ్మీర్​లోని పహల్గాంలో టెర్రర్​అటాక్​ తర్వాత వెయ్యి మందికి పైగా భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. అలాగే, సోమవారం నాటికి 800 మందికిపైగా పాకిస్తానీయులు వారి దేశానికి వెళ్లిపోయారని ఓ అధికారి తెలిపారు. ఈ నెల 22న కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పహల్గాంలో గల బైసరన్​ లోయలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దౌత్య సంబంధాలను తగ్గించడంతో పాటు వీసాల రద్దు, అటారీ -వాఘా సరిహద్దు మూసివేత వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. 

దీంతో ఈ నెల 22 నుంచి 28 వరకు ఆరు రోజుల వ్యవధిలో వెయ్యి మందికి పైగా భారతీయులు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆదివారం 236 మంది పాకిస్తానీయులు వారి దేశానికి వెళ్లిపోగా.. 115 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అయితే, రెండు దేశాల నుంచి లాంగ్​టర్మ్ వీసాలు కలిగి ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు, భారతదేశ సరిహద్దు భద్రతా దళం.. స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారిని ఇమ్మిగ్రేషన్ కొనసాగించడానికి అనుమతించారు.