
- నేరాల నివారణకు కఠిన చట్టాలు చేశామన్న ప్రధాని మోదీ
- రేప్‌లు చేసేవారికి మరణశిక్ష పడేలా నిబంధనలు మార్చినం
- అతివల కోసం వేలాది టాయిలెట్స్ నిర్మించినట్లు వెల్లడి
నవ్సారి (గుజరాత్): మహిళల భద్రతకు గత పదేండ్లుగా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. వారిపై జరిగే నేరాల నివారణకు కఠినమైన చట్టాలను రూపొందించామని అన్నారు. అత్యాచారం వంటి నేరాల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించామని చెప్పారు. గుజరాత్‌లోని నవ్సారిలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు.
వలసరాజ్యాల కాలం నాటి క్రిమినల్ చట్టం(ఐపీసీ) స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను బలోపేతం చేసిందని, ఫిర్యాదులు దాఖలు చేయడాన్ని సులభతరం చేసి, వేగంగా న్యాయం అందేలా చేస్తున్నదని చెప్పారు. మహిళలపై జరిగే తీవ్రమైన నేరాల్లో సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా 800 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, వాటిలో చాలా వరకు ఇప్పుడు పనిచేస్తున్నాయని అన్నారు.
నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని
దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడినని ప్రధాని మోదీ అన్నారు. వారి ఆశీర్వాదమే తనకు గొప్ప బలం, రక్షణ కవచం అని తెలిపారు. ‘‘మా ప్రభుత్వం మహిళలకు సమ్మాన్ (గౌరవం), సువిధ (సౌకర్యాలు) కల్పనకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. మేం వేలాది మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాం” అని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళలకు హక్కులు, అవకాశాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు.
స్వయం సహాయక బృందాలతో సుమారు 1.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే లఖ్పతి దీదీలుగా మారారని, రాబోయే ఐదేండ్లలో మొత్తం 3 కోట్ల మందిని లక్షాధికారులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. కాగా, ప్రధాని మోదీకి 2,500 మంది మహిళా పోలీసులు రక్షణ కవచంగా నిలిచారు. ఈ ఈవెంట్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం లోనే తొలిసారిగా ప్రధాని భద్రతకు మహిళా పోలీసులనే వినియోగించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
మోదీ ఎక్స్ ఖాతాలో ఆరుగురి విజయగాథలు
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకొని ‘నారీ శక్తికి వందనం’ అంటూ దేశంలోని మహిళలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తు న్నారని తెలిపారు. మోదీ ఎక్స్ ఖాతా నుంచి చెస్ క్రీడాకారిణి ఆర్.వైశాలి, సైంటిస్టులు ఎలినా మిశ్రా, శిల్పి సోని, ఫ్రాంటియర్ మార్కెట్స్ ఫౌండర్ అజైతా షా, ‘బిహార్ పుట్టగొడుగుల మహిళ’గా ప్రసిద్ధి చెందిన అనితా దేవి, ప్రముఖ న్యాయవాది అంజ్లీ అగర్వాల్ తమ సక్సెస్ స్టోరీలను పంచుకున్నారు.