ముందుకు సాగన ఓవర్సీస్ స్కాలర్ షిప్

ముందుకు సాగన ఓవర్సీస్ స్కాలర్ షిప్
  • అప్లికేషన్లు తీసుకున్నా  సాంక్షన్ చేయట్లే
  • అధికారులు పరిశీలించినా నిర్ణయం తీసుకోని సర్కారు
  • గతేడాది రెండు సీజన్లు పెండింగ్

హైదరాబాద్, వెలుగు: పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు అమలు చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ముందుకు సాగడం లేదు. స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకున్నప్పటికి ప్రభుత్వం మాత్రం స్కాలర్ షిప్ సాంక్షన్ చేయడం లేదు. రాష్ట్రంలో దీని కోసం వందలాది మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు చెందిన స్టూడెంట్స్ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకున్నప్పటి ఎంత మందికి ఇవ్వాలన్న అంశంపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవటంతో ఈ పక్రియ ముందుకు సాగడం లేదు. ఈ అప్లికేషన్లను అధికారులు ఇప్పటికే పరిశీలించినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటంతో స్టూడెంట్స్ నిరాశ చెందుతున్నారు. వీటిపై ప్రభుత్వం త్వరగా  నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఏడాదికి రెండు సార్లు

ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను ప్రతి ఏటా మార్చ్, నవంబర్ లో అందిస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలు రెండు సార్లు రూ.10లక్షల చొప్పున మొత్తంగా రూ.20 లక్షల రిలీజ్ చేస్తుంటాయి. పీజీ ఫస్ట్ ఇయర్ పూర్తయిన తర్వాత  రూ.10 లక్షలు, రెండో ఏడాది పూర్తయ్యాక మరో రూ.10 లక్షలు, ప్రయాణ ఖర్చులకు మరో రూ.50 వేలు స్టూడెంట్ బ్యాంక్ ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. అప్లికేషన్లను అప్లై చేసుకునేందుకు సర్కారు 2 నెలల పాటు అవకాశం ఇస్తుంది. ప్రస్తుతం నాలుగు శాఖల్లో గతేడాది రెండు సార్లు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్ లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

మెరిట్ లిస్ట్ ప్రకటన

ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కు మొత్తంగా 260కి పైగా వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి105 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ను రెడీ చేసింది. స్టేట్ లెవల్ సెలక్షన్ కమిటీ అభ్యర్థులను త్వరలోనే ఫైనల్ చేసి ఇందులో ఎంపిక అయిన వారికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. స్కాలర్ షిప్ ల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికి ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని,ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని అధికారులు వెల్లడిస్తున్నారు.