సుప్రీంకోర్టుకు చేరిన వక్ఫ్ వివాదం.. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు ఒవైసీ, మహ్మద్ జావేద్ పిటిషన్

సుప్రీంకోర్టుకు చేరిన వక్ఫ్ వివాదం.. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు ఒవైసీ, మహ్మద్ జావేద్ పిటిషన్

న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులోని నిబంధనలు ముస్లింలు, ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను నిర్దయగా ఉల్లంఘిస్తున్నాయని ఓవైసీ పేర్కొన్నారు.

 ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని జావేద్ తన పిటిషన్‎లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 25 (మతాన్ని ఆచరించే స్వేచ్ఛ), ఆర్టికల్ 26 (మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ), ఆర్టికల్ 29 (మైనారిటీ హక్కులు), ఆర్టికల్ 300A (ఆస్తి హక్కు) వంటి అనేక రాజ్యాంగ నిబంధనలను ఈ బిల్లు ఉల్లంఘిస్తుందని.. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్షత చూపిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేయగా.. లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది.

 ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు ఓవైసీ, జావేద్ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నెక్ట్స్ ఏం జరగనుందని ఆసక్తి నెలకొంది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి