రెండో వారంలో సీరియస్ అవుతున్న పేషెంట్ల పరిస్థితి
ఇమ్యూనిటీ సెల్స్ ఓవర్‌గా రియాక్ట్ అవడమే సమస్య
అవసరం లేనంతగా ఉత్పత్తి అవుతున్న సైట్‌కైన్స్ లంగ్స్, ఇతర అవయవాలపై దాడి..
జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లకు వైరస్ కంటే, వారి ఒంట్లో ఉన్న కణాలతోనే ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. వైరస్ పై పోరాడే ఇమ్యూనిటీ సెల్స్ ఓవర్ గా రియాక్ట్ అవడం వల్ల శరీరంలో పెద్ద తుఫానే ఏర్పడుతోంది. ఇది లంగ్స్ , ఇతర పార్ట్స్ పై ఎఫెక్ట్ చూపుతోంది. దీంతో అప్పటివరకూ ఆరోగ్యంగానే కనిపించిన వ్యక్తులు సైతం, ఉన్నట్టుండి శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి హాస్పి టల్స్ పాలవుతున్నారు. దీన్ని ముందే పసిగడితే ముప్పు నుంచి బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
వంద రెట్లు ఎక్కువగా సైటోకైన్స్ ఉత్పత్తి
ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఇమ్యూనిటీ సిస్టం, ఆ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో యాంటీ బాడీస్‌ను, కొన్ని రకాల ప్రోటీన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి . కరోనా పేషెంట్ల విషయంలోనూ, వైరస్ సోకిన మూడో రోజు నుంచి యాంటీబాడీస్, సైటోకైన్స్(గ్లైకో ప్రోటీన్స్ లేదా ప్రోటీన్ల సమాహారం) వంటివి ఉత్పత్తి అవుతున్నాయి . కొంతమందిలో ఈ సైటోకైన్స్ వంద రెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దానిని ‘సైటోకైన్స్ స్టార్మ్’గా పిలుస్తున్నారు. ఈ సైటోకైన్స్.. వైరస్‌తోపాటు శరీరంలోని కణాలు, లంగ్స్, ఇతర అవయవాలపై దాడి చేస్తున్నాయి . తొలుత లంగ్స్‌లో బ్లాక్స్ ఏర్పడి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇతర ఆర్గాన్స్ మీద కూడా వీటి ప్రభావం పడి వాటి పనితీరు నెమ్మదిస్తోంది. సైటోకైన్ స్టార్మ్ కారణంగానే చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ స్టార్మ్ మొదలవడానికి 4 నుంచి 8 రోజులు పడుతోందని, అందుకే రెండో వారంలో ఎక్కువ మందిలో శ్వాస సమస్య వస్తోందంటున్నారు. అన్ కంట్రోల్డ్ డయాబెటిస్ పేషెంట్లు, గుండె , కిడ్నీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వ్యక్తులు, హెపటైటిస్ సమస్య ఉన్నవాళ్లలో సైటోకైన్స్ ఓవర్‌గా ఉత్పత్తి అవుతుండగా, ఏ జబ్బులు లేని వాళ్లలోనూ ఈ సమస్య ఏర్పడుతున్నట్టు గుర్తించామని డాక్టర్లు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం లేదా ఇమ్యునిటీ సిస్టంలో ఇంటర్నల్ గా ఉండే లోపాలు కూడా ఇందుకు కారణమవుతాయని అపోలో హాస్పి టల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ శ్రీధర్ వివరించారు.
60 ఏండ్లు దాటినోళ్లలో మరో సమస్య
సైటోకైన్స్ తరహాలోనే బీ సెల్స్ లేదా బిలింఫో సైట్స్ కూడా కరోనా పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సెల్స్ కూడా రోగ నిరోధక శక్తిలో భాగమే. 60 ఏండ్లు దాటిన వాళ్లలో ఈ సె ల్స్ తొలినాళ్లలో ఎక్కువ ఉత్పత్తి అవుతుండడంతో మేలు కంటే నష్టం ఎక్కువగా జరుగుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. సైటోకైన్స్ తరహాలో ఇవి కూడా లంగ్స్, ఇతర అవయవాలపై ప్రభవం చూపుతున్నాయని నిజామాబాద్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగం చీఫ్, డాక్టర్ కిరణ్ మాదాల వివరించారు. సైటోకైన్ స్టార్మ్ అన్ని వయసుల వారిలో వస్తుండగా, బీ సెల్స్ సమస్య మాత్రం వృద్ధులోనే ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించామన్నారు.
ముందే పసిగట్టొచ్చు
సైటోకైన్స్ ఓవర్‌గా ఉత్పత్తి అవడాన్ని ముందే గుర్తించొచ్చు. సైటోకైన్ ఎఫెక్ట్‌తో రక్తంలో సీఆర్పీ(సీరియాక్టీవ్ ప్రోటీన్) పెరుగుతోంది. సీఆర్పీ 15 కంటే ఎక్కువ ఉంటే సైటోకైన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నట్టు లెక్క. షుగర్ , ఇతర జబ్బులు ఉన్నవాళ్లు ముందస్తుగా సీఆర్పీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. సీఆర్పీ లెవల్స్ ఎక్కువగా వస్తే ఐఎల్ 6 అనే టెస్ట్ చేయించుకోవాలి. రక్తంలో ఇది రెండు పికోగ్రామ్స్ వరకూ ఉంటే నార్మల్ గా ఉన్నట్టు . అతకంటే ఎక్కువుంటే 40 రెట్లు ఎక్కువ రిస్క్‌లో ఉన్నట్టు భావించాలి.
-డాక్టర్ కిరణ్ మాదాల, హెచ్ వోడీ, క్రిటికల్ కేర్ విభాగం, నిజామాబాద్ మెడికల్ కాలేజీ.
3 రోజుల్లో మందులేసుకోవాలి
చాలా మందిలో సెకండ్ వీక్‌లోనే సైటోకైన్ స్టార్మ్ వస్తోంది. వీటి వల్ల అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సైటోకైన్ స్టార్మ్ మొదలయ్యాక ఫస్ట్ 3 రోజుల్లోనే మెడిసిన్ తీసుకోవాలి. లేదంటే ఇంకా సీరియస్ అవుతుంది. చాలా మంది లంగ్స్‌లో బ్లాక్స్ ఏర్పడి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యాక హాస్పిటల్ కి వస్తున్నారు. ఈ లేట్ వల్ల పరిస్థితి సీరియస్ అవుతోంది. కొందరు సెల్ఫ్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ నెగ్లెక్ట్ చేస్తున్నారు.ఇలా చేయకుండా కరోనా సింప్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్లను కన్సల్ట్ చేయడం మంచిది.
–డాక్టర్ శ్రీధర్, ఐసీయూ ఇన్ చా ర్జ్, అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్.