- పట్టణానికి దూరంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మించడంపై నిరసన
- మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. అవినీతి ఆరోపణలతో పాటు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మించడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆఫీస్‌ను పట్టణంలోనే ఏర్పాటు చేయాలని పలుమార్లు నిరసనలు కూడా తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో బుధవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో 17 మంది బీఆర్‌ఎస్, ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. వైఖరి మార్చుకోకుంటే అవిశ్వాసం పెడతామని హెచ్చరించారు. బీజేపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఒక కౌన్సిలర్ కూడా మద్దతిస్తామని ప్రకటించారు.
స్వీపింగ్ మిషన్ కొనుగోలుతో మొదలు..
చైర్మన్, వైస్ చైర్మన్ అధికారులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తుండడం కౌన్సిలర్ల అసంతృప్తికి కారణమైంది. రూ.35 లక్షలు విలువ చేసే స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేసి మున్సిపాలిటీ నుంచి రూ.65 లక్షలు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా మిషన్‌ను ఒక్కరోజు కూడా వాడకుండా మూలకు పడేశారు. బిల్ కలెక్టర్లు ఫేక్ బిల్లులతో రూ.10 లక్షలకు పైగా ఫ్రాడ్ చేసినా.. రికవరీ చేయలేదు. వీధి కుక్కల నివారణ పేరుతో రూ.6.8 లక్షలు డ్రాచేసిన అధికారులు.. కుక్కలను అడవిలో వదలకుండా విషమిచ్చి చంపడంపై వివాదం రేగింది.
చిచ్చు పెట్టిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
మున్సిపాలిటీ సమీపంలోని నాగవరం వద్ద ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్‌కు సమీపంలో ఉండడం వివాదానికి దారి తీసింది. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తన స్వలాభం కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను పట్టణానికి దూరంగా నిర్మిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కౌన్సిర్లకే మద్దతుగాఉన్న చైర్మన్ మంత్రి నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, బుధవారం పనులు మొదలు పెట్టడంతో కౌన్సిలర్లంతా ఒక్కటయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో కుమ్మక్కై పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఫంక్షన్ హాల్‌లో మీటింగ్ పెట్టారు. వీరిద్దరిపై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ కు చెందిన నక్క రాములు పద్మశేఖర్, నాగన్న, కృష్ణ, గోపాల్, కంచెరవి, ఎల్ఐసీ కృష్ణ, గోపాల్, జంపన్న, మధు, యాదగిరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన బ్రహ్మయ్య, వెంకటేశ్, రాధాకృష్ణ సంతకాలు చేశారు.
వెనక్కి తగ్గేదే లేదు
అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని మున్సిపల్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. గురువారం మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి మాట్లాడుతామని, ఆయన చొరవ తీసుకోకుంటే ముందుకే వెళ్తామని చెప్పారు. చైర్మన్ , వైస్ చైర్మన్లు తమకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, తీర్మానం లేకుండానే మున్సిపల్ సాధారణ నిధులను సైతం ఇతర పనులకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. వార్డుల్లో కనీస అవసరాలకు నిధులు ఇవ్వడం లేదని, పారిశుద్ద్య పనులు, తాగునీరు, స్ట్రీట్ లైట్ల విషయంలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్క్రాప్ అమ్మకంలో అవినీతి జరిగిందని, మున్సిపల్ వాహనాలకు డీజిల్ వినియోగంలోనూ లెక్కలు చూపడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంచర్లలో సామాన్య ప్రజలు ప్లాట్లు కొని నష్టపోయారని, వీరికి న్యాయం చేయాలని కోరినా స్పందిచడం లేదని మండిపడ్డారు.