ములకలపల్లి, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఒడ్డు రామవరం పరిధిలో మేతమేస్తున్న గొర్రె కాలు జారి సీతారామ ప్రాజెక్టు కాల్వలో పడగా..దానిని రక్షించేందుకు వెళ్లి యజమాని చనిపోయాడు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం...భూక్య రాములు (59) తన గొర్రెలు, మేకలు మేపేందుకు రామవరం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాల్వ సమీపానికి తీసుకువెళ్లాడు.
అందులో ఓ గొర్రె కాల్వ ఒడ్డున మేస్తూ జారి కాల్వలో పడింది. దీంతో దాన్ని కాపాడేందుకు రాములు కాల్వలోకి దిగాడు. ఊబిలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. ప్రతిమ కంపెనీ కాల్వ వెంబడి సేఫ్టీ వాల్, ఫెన్సింగ్ నిర్మించకపోవడం వల్లే రాములు చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు మృతదేహంతో ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద ఆందోళనకు దిగారు.
రూ 20 లక్షల నష్టపరిహారం లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ పుల్లారావు, ఎస్సై రాజశేఖర్ అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. కంపెనీ యాజమాన్యం, సీతారామ ప్రాజెక్టు సిబ్బంది సీఎం ప్రోగ్రాం ఏర్పాట్లలో ఉన్నారని, తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.