రీయింబర్స్​మెంట్​ ఇవ్వని సర్కారు.. విద్యార్థుల అవస్థలు

రీయింబర్స్​మెంట్​ ఇవ్వని సర్కారు.. విద్యార్థుల అవస్థలు

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ ​జిల్లా జమ్మికుంటలోని సంఘమిత్ర మహిళా డిగ్రీ ప్రైవేట్​కాలేజీ బిల్డింగ్​కు ఏడాదిగా అద్దె కట్టకపోవడంతో సదరు ఓనర్​ విజయ్​కుమార్​ శుక్రవారం కళాశాల గేటుకు తాళం వేశాడు. అయితే సర్కారు నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​ రాకనే అద్దె కట్టలేకపోతున్నామని ప్రిన్సిపాల్​ ఆవేదన వ్యక్తం చేశాడు. తాళం వేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థినులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లకు ఫోన్లు చేశారు. దీంతో వారు దగ్గర్లోనే ఉన్న వేరే కాలేజీకి వెళ్లి క్లాసులు వినాల్సిందిగా సూచించారు. ఫీజులు ఇక్కడ కట్టి క్లాసులు అక్కడ వినడమేమిటని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్స్​యూనియన్​ లీడర్లతో కలిసి ఆందోళన చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పారు.  

రీయింబర్స్​మెంట్​ ఇస్తలేరు..ఏం చేయాలి? 
ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపాల్​ ​ఎగ్గెటి సంపత్​ను వివరణ కోరగా..తమ కాలేజీలో సెకండియర్, ఫైనలియర్​ కలిపి 125 మంది విద్యార్థినులు ఉన్నారన్నారు. మూడేండ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్​ సరిగ్గా రావడం లేదని, దీంతో ఈ ఏడాది ఫస్టియర్ అడ్మిషన్లు కూడా తీసుకోలేదన్నారు. తమకు సర్కారు నుంచి రూ.30 లక్షలు రావాల్సి ఉందన్నారు. దీంతో రెంట్ కట్టలేకపోతున్నామని, లెక్చరర్లకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తాళం వేసిన ఓనర్​కు చెప్పినా వినకపోవడంతో జమ్మికుంట పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేశారు. తమకు కొంచం వ్యవధి కావాలని, అప్పటిదాకా కాలేజీ తెరిచేలా చూడాలని ఆయన సీఐని కోరారు. దీంతో శనివారం బిల్డింగ్​యజమానిని పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు.