రెంట్‌‌ కట్టడం లేదని ఎంపీడీవో ఆఫీస్‌‌కు తాళం

  • పెండింగ్‌‌లో 26 నెలల కిరాయి

బెల్లంపల్లి రూరల్, వెలుగు : తన ఇంటిని ఎంపీడీవో ఆఫీస్‌‌ కోసం రెంట్‌‌కు ఇస్తే 26 నెలల నుంచి కిరాయి కట్టడం లేదంటూ ఓనర్‌‌ బుధవారం ఆఫీస్‌‌కు తాళం వేశాడు. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల కేంద్రంగా మారింది. అక్కడ సర్కార్‌‌ ఆఫీస్‌‌ల కోసం ప్రైవేట్‌‌ బిల్డింగ్‌‌లను రెంట్‌‌కు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీడీవో ఆఫీస్‌‌ నిర్వహణ కోసం గంగా మురళీధర్‌‌రావు అనే వ్యక్తి నెలకు రూ. 4,500 రెంట్‌‌ చొప్పున 2018 జులైలో తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఆఫీస్‌‌ ఓపెన్‌‌ అయిన తర్వాత 12 నెలల పాటు కిరాయి సక్రమంగా చెల్లించారు. 

తర్వాత అద్దె కట్టడం మానేశారు. రెంట్‌‌ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఆఫీసర్లు స్పందించడం లేదు. 26 నెలలుగా చెల్లించకపోవడంతో రూ. 1.17 లక్షలు పెండింగ్‌‌లో పడ్డాయి. దీంతో ఆగ్రహానికి గురైన మురళీధర్‌‌రావు బుధవారం ఉదయం ఎంపీడీవో ఆఫీస్‌‌కు తాళం వేశాడు. తనకు రావాల్సిన కిరాయి డబ్బులు ఇచ్చే వరకు తాళం తీసేది లేదని స్పష్టం చేశారు. 

విషయం తెలుసుకున్న ఇన్‌‌చార్జి ఎంపీడీవో గంగా మోహన్‌‌ ఆఫీస్‌‌కు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.72 వేల చెక్కును మురళీధర్‌‌కు ఇచ్చారు. దీంతో ఆఫీస్‌‌ తాళం ఓపెన్‌‌ చేశారు. అయితే నెల క్రితం ఇచ్చిన రూ.40 వేలు చెక్కు ఇప్పటికీ ట్రజరీలోనే పెండింగ్‌‌లో ఉందని, ఆ చెక్కుతో పాటు, ప్రస్తుతం ఇచ్చిన రూ.72 వేల చెక్కును త్వరగా రిలీజ్‌‌ చేయాలని మురళీధర్‌‌రావు కోరారు.