రెంట్​ చెల్లించలేదని ఎంపీడీవో ఆఫీస్​కు తాళం

రెంట్​ చెల్లించలేదని ఎంపీడీవో ఆఫీస్​కు తాళం
  •     సాయంత్రం మూడు గంటల వరకు ఆఫీసర్లు, స్టాఫ్ బయటనే
  •     వారంలోగా చెల్లిస్తామనే హామీతో తాళం తీసిన ఓనర్

ఆత్మకూర్, వెలుగు:  వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో  ఎంపీడీవో ఆఫీస్ కు  రెంట్ చెల్లించలేదని మంగళవారం ఓనర్  తాళం వేశాడు.   కొత్త మండలంగా  ఏర్పాటైన దగ్గర్నుంచి  ఎంపీడీవో, ఈజీఎస్ ఆఫీస్ లను  రెంట్​ బిల్డింగుల్లోనే నిర్వహిస్తున్నారు.  ప్రతి నెలా రూ.14వేలు చెల్లించేందుకు అంగీకరించి ఓనర్ గంగారాంతో ఒప్పందం చేసుకున్నారు.  46 నెలల నుంచి సుమారు రూ.6 లక్షలకు పైగా రెంట్ పెండింగ్ లో ఉన్నప్పటికీ,  ఈమధ్య రూ.2 లక్షలు మాత్రమే చెల్లించారు.  ఇంకా రూ.4 లక్షలకుపైగా రెంట్ పెండింగ్ లో ఉంది. రెంట్ కోసం ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా చెల్లించడం లేదని, దీంతో ఆవేదనతో ఆఫీస్ కు తాళం వేసినట్లు  ఓనర్ గంగారాం తెలిపారు.  ఉదయం 10 గంటలకే  ఆఫీస్ కు తాళం వేయడంతో ఆఫీసర్లు, సిబ్బందితో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఎంపీడీవో జ్యోతితో పాటు ఆఫీస్ స్టాఫ్,  ఎంపీపీ మాలతి తదితరులు చొరవ తీసుకుని గంగారాంతో చర్చించారు. రూ. లక్ష చెల్లించి, వారం రోజుల్లో పెండింగ్ రెంట్ అంతా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎంపీడీవో ఆఫీస్  తాళం తెరిచారు.