పాత కారుకు 4 లక్షలు పెట్టి అంత్యక్రియలు

పాత కారుకు 4 లక్షలు పెట్టి అంత్యక్రియలు
  • 4 పేజీలతో 2 వేలమందికి ఆహ్వాన పత్రికలు
  • 1,500 మందికి గ్రాండ్​గా విందు భోజనం

సూరత్: తాము కొనుక్కున్న మొదటి కారుకు ఓనర్ కుటుంబ సభ్యులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 12 ఏండ్లుగా వాళ్ల కుటుంబానికి కలిసివచ్చిన ఆ పాత లక్కీ కారు గురించి తమ వారసులు ఎప్పుడూ చెప్పుకునేలా ఉండాలని గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులందరినీ పిలిచి గ్రాండ్​గా విందు భోజనం పెట్టారు. గుజరాత్​లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం గురువారం చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కారు కొన్న తర్వాత అదృష్టం కలిసివచ్చి.. 

పదర్శింగ గ్రామానికి చెందిన సంజయ్ పోల్రాది రైతు కుటుంబం. 2006లో వేగన్ ఆర్ కారును కొనుక్కున్నారు. అప్పటినుంచి ఆ కుటుంబానికి అన్నివిధాలుగా కలిసివచ్చింది. సూరత్​లో కన్​స్ట్రక్షన్ వ్యాపారంలో అదృష్టం తెచ్చిపెట్టింది. సంపద పెరిగి కుటుంబ పరిస్థితి చక్కబడింది. దీంతో ఆ కారును లక్కీ కారుగా, తమ కుటుంబ సభ్యుడిలా సంజయ్ భావించారు. ఇటీవల దాని సర్వీస్ పూర్తవడంతో జ్ఞాపకార్థంగా ఉండేలా తమ పొలం దగ్గరే సమాధి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు 4 పేజీలున్న ఆహ్వాన పత్రికలు కొట్టించి 2 వేల మందిని ఆహ్వానించారు. కారును పూలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆచారాల ప్రకారం పూజారులచే పూజలు చేయించి, ప్రార్థనలు చేశారు. గ్రీన్​మ్యాట్​తో కప్పి15 అడుగుల లోతు గొయ్యిలో కారును సమాధి చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన 15 వందల మందికిపైగా గ్రామస్తులకు భోజనాలు వడ్డించారు. ఇందుకు రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కారు జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా సమాధి చుట్టూ మెమొరియల్ ఏర్పాటు చేస్తామని ఓనర్ సంజయ్ మిశ్రా తెలిపారు.