
- కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ
- 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుర్తింపు
- హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
- నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏయే జిల్లాల్లో ఎంతెంత అసైన్డ్ భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకున్నది. ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలింది.
ఇందులో డిజిటల్ సైన్ కానివి 5.36 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. పోడు రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని.. 2022, మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలనే దానిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే చాలా మంది రైతులు.. వారికి ఇచ్చిన అసైన్డ్ భూములను అవసరాలకు అమ్ముకున్నట్లు తెలిసింది. అయితే, ఇవన్నీ నోటరీల మీద జరిగాయి.
దళితులు, గిరిజనులు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ పట్టాలకు యాజ మాన్య హక్కులు కల్పిస్తే.. వారి అవసరాలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములు పంపిణీ చేసింది. అసైన్ చేసి 20 ఏండ్లు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్లో 1.49 లక్షల ఎకరాలు, నల్లగొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..
అసైన్డ్ భూములపై.. పేదలకు హక్కులు కల్పించడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేసింది. వాటిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ స్టడీ చేస్తున్నది. అసైన్ చేసి 20 ఏండ్లు దాటితే.. వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేలా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎంతో మంది పేద రైతులకు.. వారి అవసరాలకు క్రయ, విక్రయాలు చేసుకునే అవకాశం దక్కింది.
కర్నాటకలో 15 ఏండ్లకు, తమిళనాడులో 20 ఏండ్లకు, కేరళలో 25 ఏండ్లకు హక్కులు వర్తించేలా చట్టాలు, ఉత్తర్వులు అమలవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, యూపీలో పదేండ్లకే హక్కులు లభిస్తున్నాయి. అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పించాలనే ఆలోచన ఉందని 2021, మార్చి 26న అప్పటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలుస్తానని, ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్లకు మంచి జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆ తర్వాత అసైన్డ్ వ్యవహారాన్ని అన్ని స్కీముల మాదిరే గాలికొదిలేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఈసారి నిర్ణయం తీసుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నోటరీలపై చేతులు మారిన అసైన్డ్ పట్టాలు
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు విడతల వారీగా పేదలు సాగు చేసుకునేందుకు ర్కార్ భూములను అసైన్డ్ చేశాయి. అసైన్డ్ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా.. మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు. విక్రయం, దానం, బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ల అసైన్డ్ భూములను తక్కువ రేటుకు సంపన్నులు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం -1977ను తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈ చట్టానికి సవరణ చేసి.. ఎంత కాలం కింద కేటాయించిన అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే, అవసరాల కోసం నోటరీ పేపర్ల మీద కొందరు పేదలు అసైన్డ్ భూములను అమ్ముకున్నారు. ఈ విస్తీర్ణం కూడా లక్షల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు అసైన్డ్ భూముల పంపిణీ సమయంలో వ్యవసాయ భూములుగా, గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. కొన్ని జిల్లాల్లో ఎకరం కోట్లలో పలుకుతున్నాయి.
గత ప్రభుత్వం 2018లో అసైన్డ్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారాలను కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్ భూములు కబ్జా అయిన చోట యజమానులకు, ఆ భూమిలో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఉంటే వారికే ఆ భూమిని ఇచ్చేందుకు పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. కొన్ని కారణాలతో అది అమలు కాలేదు.
భూములపై పూర్తి హక్కులు కల్పించాలి
అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలి. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా హక్కులు కల్పిస్తున్నారో అలాగే తెలంగాణలోనూ అమలు చేయాలి. రాష్ట్రంలో పేదలకు అసైన్డ్ భూములు లావణి పట్టా, డి ఫారం పట్టా, డికెటి పట్టా, ఎర్రగీత పట్టా, పోరంబొకు పట్టాలు ఇచ్చారు.
దాదాపు 15 లక్షల రైతు కుటుంబాలు ఇప్పటికీ అభద్రతా భావంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరిలో ఎక్కువ శాతం దళిత, గిరిజన, వెనకబడిన కులాలకు చెందినవాళ్లే ఉన్నారు. ఈ విషయంలో ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు పూర్తి హక్కులు కల్పించాలి.-