- ప్రపంచంలో ఆర్థిక అసమానతలతో ముదురుతున్న దారిద్ర్యం
- రోజూ 21వేల మందిని (ప్రతి నాలుగు సెకన్లకు ఒకరిని) పొట్టనబెట్టుకుంటున్నది: ఆక్స్‌ఫామ్ భారత సీఈవో అమితాబ్ బెహర్
ఆరోగ్యకర ప్రజాస్వామ్యంలో సంపద సృష్టి ఒక దశ. ఆపై సంపద పంపిణీ కీలకం. అది తలకిందులైతే ఉత్పత్తి వృద్ధీ ప్రతికూలమౌతుంది. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వానికి బాధ్యత అప్పగించారు. సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు భంగకరంగా ఉత్పత్తైనా, సంపదైనా ఒకేచోట పోగుకాకుండా సమ్మిళిత అభివృద్ధికి రాజ్యం బాధ్యత వహించాలని అధికరణం39(సి) చెబుతున్నది. వ్యత్యాసాలను సరిదిద్దడమే సంక్షేమ రాజ్యం పని. అందుకోసమే ప్రణాళికలు, నీతి ఆయోగ్‌లు, నిర్దిష్ట కార్యక్రమాలు. కానీ, సంపన్నులు మరింత సంపన్నులయ్యేటట్టు, పేదలు ఇంకింత పేదరికంలోకి జారేట్టు మన ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలుంటున్నాయి.
ఏటా అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుదల ఏ విపత్తులకు దారితీస్తుందోనన్న గుబులు పుడుతున్నది. ఆక్స్‌ఫామ్ వంటి అంతర్జాతీయ సంస్థలు, దేశీయ పౌర సంఘాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా పాలకులది పెడచెవే! ఫలితంగా సమాజంలో తీవ్ర అశాంతి ప్రబలుతున్నది. ఆ ప్రభావాలను ఎవరూ శాస్త్రీయంగా అంచనా వేయట్లేదు, లెక్కగట్టట్లేదు. ఉద్యమాలు, విప్లవాలు ఊరకే రావు. విప్లవం గురించి ఒక గొప్ప మాట చెబుతారు విజ్ఞులు. విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదని, విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప–ఉత్పత్తి మాత్రమే అంటుంటారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘.. పురిటి నొప్పులు స్పురింపించాయి’ అన్న విపరీత పరిస్థితులు సమాజంలో నెలకొనకుండా చూసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వాలదే!
కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే...
గోరటి వెంకన్న ఓ పాటలో చెప్పినట్టు ‘అద్దాల అంగడీ మాయ’! మనకు తెలయకుండానే సదరు మాయకు వశమై పోతున్నాం. ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత మార్కెట్ శక్తులకు సగటు మనిషి ఒక వినిమయ వస్తువైపోయిన దారుణ పరిస్థితి. మన ప్రభుత్వాల విధానాలూ దానికి దోహదపడేవిగానే ఉంటున్నాయి. ఆస్తి కలిగిన వారి సంపదవృద్ధి రాకెట్లా పైకి ఎగబాకుతుంటే, పేదల బతుకులు ఇంకా దారిద్ర్యంలోకి పాదరసంలా జారిపోతున్నాయి. 2021లో మన దేశంలోని100 మంది పైపొర ధనవంతుల ఉమ్మడి సంపద విలువ 53.30 లక్షల కోట్ల రూపాయలు. దిగువన ఉండే 50 శాతం జనాభా సంపద కలిపితే కూడా 6 శాతం లోపే! 77 శాతం దేశ సంపద ధనికులైన పది శాతం జనాభా చేతిలో ఉంది.
సంపద వార్షిక వృద్ధిరేటు కూడా అంతే ఆశ్చర్యకరం. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసిన రెండేండ్ల(మార్చి 2020–నవంబరు 2021) కాలంలో రూ.100 కోట్లకు పైబడి ఆస్తులున్న వారి సంపద విలువ 23.14 లక్షల కోట్ల నుంచి 53.16 లక్షల కోట్లకు పెరిగింది. అంటే, దాదాపు రెట్టింపు. అదే దురదృష్టకాలంలో 4.8 కోట్ల మంది పేద–మధ్యతరగతి భారతీయులు కటిక దారిద్ర్యంలోకి జారిపోయారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం, ప్రపంచమంతటా కలిపి కొత్తగా దారిద్ర్యరేఖ దిగువకు జారిన జనాభాలో ఇది సరిగ్గా సగం! ఎందరెందరివో ఉద్యోగాలు పోవడం, ఉపాధి కరువవడం, జీతాల్లో కోత, రాబడిలో తరుగుదల.. ఎన్ని చూశామో!
ప్రపంచంలో రెండో సంపన్నుడైన మన గౌతమ్ అదానీ సంపద 2014లో 17000 కోట్ల రూపాయల నుంచి, ఇప్పుడు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఏడాది(2020–2021) లో ఆరు రెట్లకు పైగా (8.9–50.5 బిలియన్ డాలర్లకు) పెరిగినట్టు పోర్బ్స్ రియల్‌టైమ్ డేటా చెబుతున్నది. మరోపక్క ప్రపంచంలో ఆర్థిక అసమానతలతో ముదిరే దారిద్ర్యం, రోజూ 21000 మందిని (ప్రతి నాలుగు సెకన్లకు ఒకరిని) పొట్టనబెట్టుకుంటున్నదని ఆక్స్‌ఫామ్ భారత సీఈవో అమితాబ్ బెహర్ చెబుతున్నారు.
గ్రహించరా? అంగీకరించరా?
కొందరు మేధావులకు సమాజంలో పెరిగే ఇంతటి ఆర్థిక అంతరాలు అసలు సమస్యగానే కనిపించదు. ‘తెలివైన వారు, అదృష్టవంతులు పెట్టుబడితో వ్యాపారం చేసి సంపద గడిస్తే మీకేం కడుపు నొప్పి’ అన్నట్టు మాట్లాడుతారు. ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఇలాగే ఆలోచించడం తప్పు. సరిగ్గా రెండు దశాబ్దాల కింద అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నాటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఓ గొప్ప మాట చెప్పి వెళ్లారు.
నాటి ముఖ్యమంత్రితో పాటు వేదికమీదున్న ప్రముఖ ఆర్థికవేత్తలు దేశ ఆర్థిక పురోగతి గురించి, వార్షిక వృద్ధిరేటు గురించి ఊదరగొట్టే ఉపన్యాసాలిచ్చారు. తన వంతు వచ్చినపుడు సదరు స్విట్జర్లాండ్ మంత్రి మాట్లాడుతూ, ‘ఇంతటి ఆర్థిక అసమానతలతో, విద్య, వైద్య, పారిశుద్ధ్య రంగాల వెనుకబాటుతనంతో మీరు సాధించబోయేది 8 శాతం వార్షిక వృద్ధి రేటా? ఇలాంటి మాటలు నేను మా దేశంలో చెబితే, తప్పుడు గణాంకాలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నానని నన్ను జైల్లోనయినా పెడతారు, లేదా నా మానసిక పరిస్థితి బాగోలేదని పిచ్చాసుపత్రిలోనైనా చేరుస్తారు’ అన్నారు. కానీ, క్రూరమైన జొకేంటంటే? ఆ మరుసటి ఏడే మనం 8 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాం.
తలసరి ఆదాయం లెక్కలెప్పుడూ అట్లాగే ఉంటాయి. బ్రిటన్ని వెనక్కి నెట్టి, మనం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. మన తలసరి ఆదాయం యేడాదికి రూ. లక్షా డెబ్బై వేలు(2227 డాలర్లు ). ఈ తలసరి లెక్కలొక తప్పుల తడక! ఏటా15 కోట్లు సంపాదించే ఓ పెద్ద కంపెనీ సీఈవో, నెలకు లక్ష (యేడాదికి పన్నెండు లక్షలు) జీతం పుచ్చుకునే సీనియర్ టీచర్, నెలకు అయిదువేల రూపాయలతో కనీస వేతనమైనా(యేడాదికి 60వేలు) పొందని కూలీ.. ముగ్గురి రాబడి కలగలిపి, మూడుచేత భాగించి తలసరి లెక్కలు కడతారు. కిందటేడు100 రూపాయలు మిగులు, ఈ సారి110 రూపాయలయితే, అదనపు విలువ(శ్రమశక్తి)ని లాభం అంటూ, 10 శాతం వృద్ధిరేటుగా చెప్పే లెక్కలూ అర్థం లేనివే. పెట్టుబడిదారు ఆర్థిక శాస్త్రమే రాజ్యేమేలే వ్యవస్థలో, కళ్లెదుట కనిపించే ఆర్థిక వ్యత్యాసాలను పాలకులు గ్రహించరో, గ్రహించినా అంగీకరించరో అర్థమే కాదు!
లోపాయికారి విధానాల వల్లే...
పేద ప్రజలను ఆదుకునే సంక్షేమ పథకాలు సరిగా అమలు కావు. వాటికీ, ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టి కుప్ప–తెప్పలుగా ఓట్లు దండుకునేందుకు నేతలు చేసే ‘అనుచిత ఉచితాల’ ప్రకటనకూ మధ్య తేడాని, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తేల్చలేకపోయింది. దశాబ్దాలుగా పేదలకు మెతుకులు విదిల్చి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారు. పేదల జీవన ప్రమాణాలెన్నటికీ పెరగవు. విధాన నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. వెయ్యికోట్లకు పైన సంపదగలిగిన వారి సంఖ్య దేశంలో 1103కి పెరిగింది. ఈ యేడు కొత్తగా 96 మంది వస్తే, ప్రధానంగా ఉన్నది ఫార్మసీ(36), పెట్రో–కెమికల్ (23), సాఫ్ట్వేర్(21) రంగాలకు చెందిన వారే! 60 శాతానికి మించి జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం రోజురోజుకు కునారిల్లుతున్నదీ దేశంలో. పౌరులు నిత్యం వాడే చమురు, ఇంధనాల ధరలు ఏడాదిలో 33 శాతం పెరిగాయి.
అదే సమయంలో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ‘సూపర్‌రిచ్’ సంపద పన్నును 2016లో పూర్తిగా తొలగించారు. రైతులకో, మరే అభాగ్యులకో ఇచ్చే వ్యవస్థాగత రుణాల పరిధి ఏటికేడు కుచించుకుపోతుంటే. కార్పొరేట్ కంపెనీలు, శక్తులు నిలువునా ముంచడం వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) లక్షల కోట్లలో మలెవడుతున్నాయి. పైగా వాటిని సర్కార్లు మాఫీ చేస్తుంటాయి. అంటే, దానర్థం ప్రభుత్వాలు ఎవరిపక్షం వహిస్తున్నాయి? ఆర్థిక అంతరాల పెరుగుదలకు ఇది కారణం కాదా? అందరూ ఆలోచించాలి.
- దిలీప్ రెడ్డి.
dileepreddy.r@v6velugu.com