- కేంద్రం అభ్యర్థన మేరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అంగీకారం
లండన్: తమిళనాడులోని ఓ టెంపుల్ లో చోరీకి గురైన సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి, స్వామీజీ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని(60 సెంటీమీటర్లు) బ్రిటిషర్లు తమిళనాడులోని ఓ గుడి నుంచి దొంగిలించి పట్టుకుపోయారు.
దాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని అష్మోలియన్ మ్యూజియం సోథెబీ వేలం(1967)లో డాక్టర్ జేఆర్.బెల్మాంట్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అది అష్మోలియన్ మ్యూజియంలోనే ఉంది. ఈ విగ్రహం పుట్టు పూర్వోత్తరాల గురించి గతేడాది ఒక స్వతంత్ర పరిశోధకుడు తమకు సమాచారం అందించాడని, ఆ తర్వాత భారత హైకమిషన్ ను అప్రమత్తం చేశామని అష్మోలియన్ మ్యూజియం పేర్కొంది. ఈ క్రమంలో తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని మ్యూజియం మేనేజ్మెంట్ ను భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించింది.
భారత్ అభ్యర్థన మేరకు విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ 2024 మార్చి 11న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారత్ కు రానుంది. భారత్ లో చోరీకి గురై యూకే చేరిన అనేక కళాఖండాలను తిరిగి తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కూడా యూకే నుంచి మన దేశానికి అనేక విలువైన విగ్రహాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో తమిళనాడుకు చెందిన నవనీత కృష్ణ(17 వ శతాబ్దం) కాంస్య శిల్పాన్ని యూకేలోని భారత హైకమిషనర్ కు అప్పగించారు.