మనుషులపై కరోనా టీకా.. ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్
‘ది లాన్సెట్’ జర్నల్లో రిజల్ట్స్
ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ అయితేనే మార్కెట్లోకి టీక
లండన్: ఆక్స్ ఫర్డ్యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేస్తున్న కరోనా వైరస్ టీకా సేఫ్ అని తేలింది. బ్రిటన్ లో మనుషులపై జరిగిన ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా బాగా పని చేస్తున్నట్లు కన్ఫమ్ అయింది. అయితే, బ్రిటన్ లో ఫేజ్ 2, యూకే, యూఎస్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో ఫేజ్ 3 ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ రెండు ఫేజ్ లలోనూ టీకా సక్సెస్ అయితేనే మార్కెట్లోకి విడుదలయ్యే చాన్స్ ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే.. మరో రెండు నెలల్లోనే ఈ టీకా మార్కెట్లోకి వచ్చే చాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆక్స్ ఫర్డ్ ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తిగా సక్సెస్ అయినట్లు సోమవారం ‘ది లాన్సెట్’ మెడికల్ జర్నల్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ రిజల్ట్స్ ఆ జర్నల్ సోమవారం పబ్లిష్ చేసింది. ఇది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మనుషులలో ఇమ్యూన్ రియాక్షన్ ను విజయవంతంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ టీకా ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్ అయినట్లు ఇటీవలే వార్తలు వచ్చినప్పటికీ, అధికారికంగా రిజల్ట్స్ పబ్లిష్ కావడంతో, ఇది సక్సెస్ ఫుల్ గా ఫేజ్ 1 ట్రయల్స్ ను దాటినట్లు
అయింది. అయితే, ఈ టీకాపై భారీ ఎత్తున ఆశలు మొదలయ్యాయి. దీంతో యూకే ప్రభుత్వం ఇప్పటికే 10 కోట్ల వ్యాక్సిన్ డోసుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.
ఈ టీకా ఎలా పనిచేస్తది?
చింపాంజీల్లోసాధారణ జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌ను జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా మార్చి టీకా తయారు చేశారు. మనుషుల్లో ఇన్ఫెక్షన్లకు దారి తీయకుండా జెనెటికల్ గా మార్చారు. కరోనాపై ఉండే స్పైక్ ప్రొటీన్ల ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే.. ఈ టీకాకు వాడిన వైరస్ కూడా దానిపై కరోనా లాంటి స్పైక్ ప్రొటీన్లను తయారు చేసేలా మార్చారు. దీంతో ఈ వైరస్ స్పైక్ ప్రొటీన్లకు అతుక్కునే కొత్తయాంటీబాడీలు వాలంటీర్ల రక్తంలో తయారయ్యాయి. వాటిని గుర్తించడం ద్వారా తెల్లరక్తకణాలు వైరస్ కణాలను నాశనం చేశాయి. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టం.. కరోనాను కూడా అంతం చేసేలా ట్రెయినింగ్ పొందుతుంది. ఈ టీకా తయారీ రీసెర్చ్ ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన
పెడ్రో ఎం ఫోలెగట్టీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
90% మందిలో ఒక డోసుకే రిజల్ట్..
ఫేజ్ 1 ట్రయల్స్ లో 1,077 మందికి టీకా ఇవ్వగా, వారి రక్తంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు, టీ సెల్స్ విజయవంతంగా ఉత్పత్తి అయినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఫేజ్ 1 ట్రయల్స్ లో వాలంటీర్లకు టీకా ఇచ్చిన 14 రోజులకు టీ సెల్స్, 28 రోజులకు యాంటీబాడీలు పీక్ లెవల్ కు చేరాయి. 90 శాతం మందిలో ఒక డోసుకే యాంటీ బాడీలు తయారయ్యాయి. ఈ టీకాతో 70% మందికి తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లు ఫేజ్ 1 ట్రయల్స్ లో తేలింది. వీటిని పారాసిటమాల్ తో అధిగమించొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. ఫేజ్ 2, 3లలో యూకేలో మరో 10 వేల మంది, అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాల్లో 37 వేల మందిపై ప్రయోగాలు జరగాల్సి ఉంది. తదుపరి ట్రయల్స్ లోనూ టీకా సేఫ్ అని తేలితేనే ఇది మార్కెట్లోకి రానుంది.
టీకా పేరు: సీహెచ్ఏడీఓఎక్స్1ఎన్
సీవోవీ-19 (అఫీషియల్ గా ‘ఏజెడ్1222’ అని పిలుస్తున్నారు)
టీకా రకం: చింపాంజీ అడినోవైరస్ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్
తయారు చేస్తున్నది: జెన్నర్ ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ
ఉత్పత్తి చేయనున్నకంపెనీ: ఆస్ట్రాజెనెకా పీఎల్ సీ (బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ)
For More News..