బిలుల్లు చెల్లించకపోవడంతో సరఫరా ఆపేసిన కాంట్రాక్టర్
ఆందోళనకు గురైన పేషెంట్లు, బంధువులు..
వెంటనే గాంధీ, చెస్ట్ హాస్పిటళ్లకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ కరోనా ట్రీట్ మెంట్ కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్లో శనివారం ఆక్సిజన్ సప్లై బంద్ అయింది. సుమారు వంద మంది పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దవాఖానాకు ఆక్సిజన్ సప్లై చేసే కాంట్రాక్టర్ కు సర్కార్ కొంత కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సప్లై ఆపేశారు. శనివారం ఉదయం నుంచే దీనిపై హాస్పిటల్లో చర్చ జరిగింది. ఆఫీసర్లు ఆక్సిజన్ సప్లై తెప్పించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. దీంతో పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 30 అంబులెన్స్ లు పెట్టి వారిని గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటళ్లకు తరలించారు. ఈ విషయంపై టిమ్స్ సూపరింటెండెంట్ ఇషాన్ అహ్మద్ ఖాన్ ను ఫోన్ లో సంప్రదించగా.. ఆక్సిజన్ షార్టేజీ ఏమీ లేదని.. తోసిపుచ్చారు. సీరియస్ గా ఉన్న పేషెంట్లను రెగ్యులర్ గా గాంధీకి తరలిస్తున్నామని శనివారం కూడా అలాగే తరలించామని చెప్పారు. మరి శనివారం ఎందరు పేషెంట్లను తరలించారని ప్రశ్నించగా.. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.
కరోనా కట్టడికి వేల కోట్లయినా ఖర్చుపెడ్తామన్న సర్కారు .. కాంట్రాక్టర్ కు బిల్లులి వ్వకపోవడం, పేషెంట్లను ఇబ్బందులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాగైతే తమ వారికి ఏమవుతుందోనని పేషెంట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు . టిమ్స్ లో ఆక్సిజన్ కొరత ఉందన్నది అవాస్తవమని డీఎంఈ రమేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేషెంట్లకు సరిపోయేన్ని సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు .
గొప్పగా చెప్పి ..
కరోనా అలజడి మొదలైన కొత్తలో గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సర్కారు గొప్పగా ప్రకటించింది. ఏకంగా 1,500 బెడ్లతో, సకల సౌకర్యాలతో ఎయిమ్స్స్థా యిలో తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. కానీ ఐదారు నెలలు అయినా ఏదీ ఓ కొలిక్కి రాలేదు. హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేసినా డాక్టర్లు, స్టాఫ్ ను నియమించక చాలా రోజులు ఖాళీగానే ఉంది. తర్వాత కాంట్రాక్ట్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినా.. సర్కారు పెట్టిన రూల్స్, ఇవ్వజూపిన జీతాలతో చేరేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. మొత్తంగా సగం మేర స్టాఫ్ సమకూరడంతో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.