న్యూఢిల్లీ: ఓయో పేరెంట్ కంపెనీ ఒరవెల్ స్టేస్ లిమిటెడ్ రూ.1,457 కోట్లు సేకరించింది. ఐపీఓకి రావాలని ప్లాన్ చేస్తున్న ఈ కంపెనీ జీ–సిరీస్ ఫండింగ్ రౌండ్‌లో ఇన్వెస్టర్ల కన్సార్టియం నుంచి మొదట రూ.1,040 కోట్లు సేకరించింది. తర్వాత ఇదే సిరీస్‌లో రూ.416.85 కోట్లు సేకరించింది. అదనపు షేర్లను ఇష్యూ చేయడానికి 99.99 శాతం మంది ఓయో షేర్ హోల్డర్లు ఈ నెల 8 న జరిగిన ఈజీఎంలో ఆమోదం తెలిపారు.
గ్లోబల్‌గా విస్తరించడానికి, గ్రోత్ ప్లాన్స్‌కు తాజాగా సేకరించిన ఫండ్స్‌ను వాడతామని ఓయో ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. 2.4 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర సిరీస్ జీ ఫండింగ్ జరిగిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. కంపల్సరీ కన్వెర్టబుల్ కమ్యులేటివ్ ప్రిఫెరెన్స్ షేర్లను ఓయో అమ్మగా, ఒక్కో షేరును రూ.29 దగ్గర విక్రయించింది. ఇన్‌క్రెడ్ వెల్త్, జే అండ్ ఏ పార్టనర్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రమోటర్ల ఆఫీస్, ఏఎస్‌కే ఫైనాన్స్ హోల్డింగ్ తాజా ఫండింగ్ రౌండ్‌లో పాల్గొన్నాయి.