- ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు
హుజూర్ నగర్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తానని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు తెలిపారు. సోమవారం హుజూర్‌నగర్‌లో ఓజో ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీ కోటాలో టికెట్ కావాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ సీటు ఇవ్వకున్నా ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవచేసే తీరికలేని నాయకులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వదని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు.
మంత్రిగా పనిచేనప్పుడే 50 వేల మెజారిటీ రాలేదని ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో 50 వేల ఓట్లు మాత్రమే వస్తాయని విమర్శించారు. ఉత్తమ్ దంపతులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను నియోజకవర్గంలోని గుడి , బడి, చర్చి, మసీదుల్లో మౌలిక సదుపాయాలు కల్పించానన్నారు.
స్టూడెంట్లకు పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇప్పించానని, ముగ్గురు ఎస్సైలుగా, నలభై మంది కానిస్టేబుల్స్ గా ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఈ సమావేశంలో నేతలు కుక్కల వెంకన్న ,కాకునూరి శివారెడ్డి , రాచమళ్ల సైదులు, శివ శంకర్, రసూల్, ఆవులపాటి శ్రీను, బొమ్మకంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.