జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే.. జార్ఖండ్​కు అతిపెద్ద శత్రువులు

  • చొరబాట్లతో రాష్ట్రానికి ముప్పు: మోదీ
  • జంషెడ్​పూర్ ర్యాలీలో ప్రధాని స్పీచ్
  • 6 వందే భారత్ రైళ్లు ప్రారంభం

జంషెడ్​పూర్(జార్ఖండ్): బంగ్లాదేశీయులు, రోహింగ్యాల చొరబాట్లతో జార్ఖండ్​కు భారీ ముప్పు వాటిల్లుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అధికార జేఎంఎం పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఆదివారం జార్ఖండ్​లోని జంషెడ్ పూర్(టాటానగర్) గోపాల్ మైదాన్​లో బీజేపీ నిర్వహించిన ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ మాట్లాడారు. ‘‘బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులతో రాష్ట్రంలోని సంథాల్ పరగణాలు, కొల్హాన్ ప్రాంతాలకు భారీ ముప్పు ఏర్పడుతోంది. చొరబాట్ల కారణంగా ఇక్కడ గిరిజన జనాభా తగ్గిపోతోంది. ఇతర వర్గాల జనాభా వేగంగా పెరుగుతోంది. 

గిరిజనుల భూములను, అటవీ భూములను చొరబాటుదారులు ఆక్రమించుకుంటున్నారు. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ అధికార దాహంతో ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మూడు పార్టీలే రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులు” అని ఆయన ఫైర్ అయ్యారు. హేమంత్ సోరెన్ సర్కారు గిరిజన సీఎం చంపయీ సోరెన్​ను కూడా అవమానించిందన్నారు. 

హేమంత్ సర్కారు పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందని, భూములు, గనులు లూటీ చేస్తోందన్నారు. జార్ఖండ్​ను ప్రత్యేక రాష్ట్రంగా చేసేందుకు బీజేపీ శ్రమిస్తే.. ఇప్పుడు జేఎంఎం కూటమి పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లో 
బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.

6 వందే భారత్ రైళ్లు ప్రారంభం

జార్ఖండ్, ఒడిశా, బిహార్, యూపీలో నడిచే 6 కొత్త వందే భారత్ ట్రెయిన్లను ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్​గా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ట్రెయిన్లు టాటానగర్–పాట్నా, బ్రహ్మాపూర్–టాటానగర్, రూర్కెలా–హౌరా, దియోఘర్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయ–హౌరా మధ్య నడవనున్నాయి.   

పేదలకు 1,13,400 ఇండ్లు మంజూరు.

జార్ఖండ్​లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎంపికైన 32వేల మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం శాంక్షన్ లెటర్లను ప్రధాని వర్చువల్​గా పంపిణీ చేశారు. తొలి విడత కింద రూ. 32 వేల కోట్లను కూడా రిలీజ్ చేశారు. 46 వేల మంది లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లోనూ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,13,400 మందికి ఈ స్కీం కింద ఇండ్లు మంజూరు అయ్యాయని పీఎంవో వెల్లడించింది.