యాదాద్రి, వెలుగు: జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తెలంగాణ దక్షిణ భారత దేశంలో రెండోస్థానంలో నిలిచిందని హైకోర్టు జడ్జి పీ సామ్కోషి తెలిపారు. భువనగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన వివిధ కోర్టుల న్యాయమూర్తులు, ప్రభుత్వ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లతో శనివారం ముఖాముఖిగా మాట్లాడారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగెషన్ కేసులను సత్వరంగా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.
చిన్నచిన్న తగాదాలను పెద్దవి చేసుకోవడం వల్ల మానవ సంబంధాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం ఉత్తమ వేదిక అని అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్తో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతోందని, తద్వారా కుటుంబ ప్రగతికి తోడ్పాటు కలుగుతుందన్నారు. చిన్న కేసులు పరిష్కారం కావడం వల్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ తీవ్రమైన నేరాలపై దృష్టి సారించి విచారణ త్వరగా పూర్తి చేసే అవకాశముంటుందని చెప్పారు.
యాదాద్రి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే మధ్యవర్తిత్వ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు భువనగిరి కోర్టు ప్రాంగణములో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎన్ గోవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే మారుతీ దేవి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర, జడ్జీలు కే మురళి మోహన్, కే దశరథ రామయ్య, డీ నాగేశ్వర్ రావు, జీ కవిత, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగారం అంజయ్య ఉన్నారు.