- 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ ఎన్నిక
న్యూఢిల్లీ, వెలుగు: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీ మెంబర్ గా తెలంగాణ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పబ్బ సురేశ్ గెలుపొందారు. ఢిల్లీలోని పీసీఐలో శనివారం పోలింగ్ జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85% ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు. కాగా ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్ గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ ల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు. తన గెలుపు ద్వారా తెలంగాణ జర్నలిస్ట్ ల గొంతు వినిపించేందుకు అవకాశం దక్కిందన్నారు. తనకు మద్దతు తెలిపి, తన గెలుపు కోసం సహకరించిన పీసీఐ మెంబర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.