షమీ మెరిసినా..లక్ కలిసిరాలేదు

వడోదరా : టీమిండియా స్టార్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ (3/61) మెరిసినా.. విజయ్‌‌ హజారే ట్రోఫీలో బెంగాల్‌‌ క్వార్టర్‌‌ఫైనల్‌‌కు అర్హత సాధించలేదు. గురువారం జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్స్‌‌లో హర్యానా 72 రన్స్‌‌ తేడాతో బెంగాల్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడిన హర్యానా 50 ఓవర్లలో 298/9 స్కోరు చేసింది. పార్త్‌‌ వాట్స్‌‌ (62), నిశాంత్‌‌ సింధు (64), సుమిత్‌‌ కుమార్‌‌ (41 నాటౌట్‌‌) రాణించారు. తర్వాత బెంగాల్‌‌ 43.1 ఓవర్లలో 226 రన్స్‌‌కు ఆలౌటైంది. అభిషేక్‌‌ పోరెల్‌‌ (50), సుదీప్‌‌ కుమార్‌‌ (36), అనుస్తుప్‌‌ (36) రాణించారు. ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ పార్త్‌‌ వాట్స్‌‌ 3 వికెట్లు పడగొట్టాడు.

మరో మ్యాచ్‌‌లో అభిజిత్‌‌ తొమర్‌‌ (111) సెంచరీతో చెలరేగడంతో రాజస్తాన్‌‌ 19 రన్స్‌‌ తేడాతో తమిళనాడుపై నెగ్గింది. ముందుగా రాజస్తాన్‌‌ 47.3 ఓవర్లలో 267 రన్స్‌‌కు ఆలౌటైంది. మహిపాల్‌‌ లోమ్రోర్‌‌ (60) ఆకట్టుకున్నాడు. వరుణ్‌‌ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. తర్వాత తమిళనాడు 47.1 ఓవర్లలో 248 రన్స్‌‌కే పరిమితమైంది. నారాయన్‌‌ జగదీశన్‌‌ (65) టాప్‌‌ స్కోరర్‌‌. విజయ్‌‌ శంకర్‌‌ (49), బాబా ఇంద్రజిత్‌‌ (37), మహ్మద్‌‌ అలీ (34) పోరాడారు. అమన్‌‌ షెకావత్‌‌ 3 వికెట్లు తీశాడు. తొమర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది.