తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్, కాంగ్రెస్ హామీలు నమ్మొద్దు : పడాల శ్రీనివాస్

తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్, కాంగ్రెస్ హామీలు నమ్మొద్దు : పడాల శ్రీనివాస్

యాదగిరిగుట్ట, రాజాపేట, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్  హామీలను నమ్మి మోసపోవద్దని బీజేపీ కర్నాటక ఎమ్మెల్యే డాక్టర్ చంద్రులమానీ, ఆలేరు  అభ్యర్థి పడాల శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. బుధవారం తుర్కపల్లి మండలం మాదాపూర్‌‌‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజన తండాల్లో కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.  

తెలంగాణ వచ్చాక అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం..  గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారి అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి  మోసం చేశారన్నారు. ఎన్నికల వేళ వారి ఓట్ల కోసం గిరిజనబంధు అంటున్నారని, జాగ్రత్తగా  ఉండాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.  

ALSO READ : తెలంగాణలో దోపిడీ సర్కారును గద్దె దింపాలె : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

వారికి ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ములుగు సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును  రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.  అనంతరం రాజాపేటలో రోడ్‌షో నిర్వహించి.. ఈ సారి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు, సర్పంచ్ యాటా పెంటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌‌ నరేశ్, గిరిజన మోర్చా జిల్లా నాయకుడు కిషన్ నాయక్ ఉన్నారు.