రేపటి నుంచే పెద్దగట్టు జాతర షురూ..

  • రేపటి నుంచే జాతర షురూ.. 
  • 15లక్షల మంది వచ్చే అవకాశం
  • విధుల్లో 1850 పోలీసులు 500మంది వాలంటీర్లు
  • 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
  •  గుట్ట చుట్టూ ఐదు చోట్ల పార్కింగ్​

సూర్యాపేట, వెలుగు: దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5 నుంచి షురూ కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర గా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు వస్తారు. ఈసారి జాతరకు దాదాపు 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో 24గంటలూ జాతర వద్ద నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు జాతీయ రహదారి పై వెహికల్స్ డైవర్షన్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, జాతర వద్ద వెహికిల్స్ పార్కింగ్ స్థలాల రూట్ మ్యాప్​లను ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు.పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వలంటీర్లతో  పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ మూడు విడతల్లో 24 గంటలూ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. జాతర పరిసరాల్లో పోలీసు కంట్రోల్ రూమ్, హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. పెద్దగట్టు చుట్టూ 60 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పెద్దగట్టు చెరువు చుట్టూ ప్రమాదాలు జరగకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 

ట్రాఫిక్ సమస్య రాకుండా.. 

పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై బారికేడ్స్ ఏర్పాటు చేశారు. - హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్ టేకుమట్ల వద్ద జాతీయరహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా .. రాఘవపురం స్టేజి నుంచి నామవరం మీదుగా గుంజలూరు స్టేజి వరకు, కోదాడ, విజయవాడ వైపునకు మళ్లించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే హెవీ వెహికల్స్ టేకుమట్ల నుంచి ఖమ్మం మీదుగా కోదాడ వైపు డైవర్షన్ చేస్తున్నారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ను గుంజలూరు వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డు మీదుగా రోల్లబండ తండా వరకు మళ్లించి ఖమ్మం హైవే నుంచి రాయినిగూడెం వద్ద యూటర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హెవి వెహికిల్స్, ట్రాన్స్​పోర్ట్​ వెహికిల్స్ కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్ పల్లి కి డైవర్షన్ చేశారు.కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట కు వచ్చే ఆర్టీసీ బస్సులను గుంజలూరు వద్ద ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం, సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి వెళ్లే  బస్సులను కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం ఖమ్మం జాతీయరహదారి మీదుగా నామవరం గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించనున్నారు. 

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​... 

 జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్ వెంకట్​రావు తెలిపారు. శుక్రవారం ఆయన పెద్ద గట్టు జాతర ప్రదేశాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్​ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మీడియాతో మాట్లాడారు. భక్తులకు తాగునీరు, శానిటేషన్ లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నేటి నుంచి ఎండోమెంట్ అధికారులు, వైద్య సిబ్బంది 24 గంటలూ డ్యూటీలో ఉంటారని చెప్పారు కార్యక్రమంలో పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కోడి సైదులు యాదవ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎస్పీ నాగభూషణం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.     

ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు 

 పార్కింగ్ కోసం ఐదు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చే భక్తుల కోసం రామకోటి తండా వెళ్ళే మార్గంలో పార్కింగ్ ఏర్పాటు చేయగా.. గరిడేపల్లి, పెన్ పహాడ్ నుంచి వచ్చే వారికోసం కలెక్టరేట్ వెనుక భాగంలో, కోదాడ నుంచి వచ్చే భక్తులకు ఖాసీం పేట వద్ద, మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను మున్యానాయక్ తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించారు. ఇక జాతరకు వచ్చే వీఐపీల వెహికల్స్ కోసం పెద్దగట్టు తూర్పు మెట్లకు ఎదురు భాగంలో పార్కింగ్ స్థలం కేటాయించారు.