బారికేడ్లుగా వడ్ల క్లీనింగ్ మెషీన్లు

బారికేడ్లుగా వడ్ల క్లీనింగ్ మెషీన్లు
  • నాగర్​కర్నూల్​ వ్యవసాయ మార్కెట్​ ఆఫీసర్ల నిర్వాకం
  • అభ్యంతరం చెబుతున్న జిల్లా రైతులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్  జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్  యార్డులో వడ్ల క్లీనింగ్  మెషీన్లను బారికేడ్లుగా పెట్టడంపై జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్  జిల్లాకు 2022లో 30 వడ్ల క్లీనింగ్  మెషీన్లు వచ్చాయి. అప్పటి నుంచి వాటిని మార్కెట్  గోదాంలో భద్రపరిచారు. రెండేండ్ల నుంచి వాటిని వినియోగించకుండా గోదాంలోనే ఉంచారు. ఇటీవల ఆ గోదామ్​లో స్ట్రాంగ్ రూమ్​ ఏర్పాటు చేశారు.

పార్లమెంట్​ ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచారు. సదరు గోదామ్​లో ఉన్న ప్యాడీ మెషీన్లను బయటపెట్టారు. వాటిని బారికేడ్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో మెషీన్ ను రూ.లక్షన్నర చొప్పున రూ.45 లక్షలు ఖర్చుపెట్టి కొనుగోలు చేశారు. రెండేండ్ల నుంచి వాటిని వినియోగించలేదు.

ఇలా బయటపడేస్తే వానకు తడిసి, ఎండకు ఎండి పనికిరాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మరోచోట భద్రపర్చకుండా బారికేడ్లుగా వాడడంపై రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. వీటిని వడ్ల కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు.