- యాసంగిలో వరి జోరు
- 2.31 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
- ఇటీవల భారీ వర్షాలతో యాసంగికి నీళ్లు ఫుల్
కామారెడ్డి . వెలుగు : కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లోనూ వరి పంటనే అధిక విస్తీర్ణంలో సాగు కానుంది. ఈసారి 4.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంటున్నారు. సాగు నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. 2.31 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని దీంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరగనున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో 5లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇటీవల భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నిరుటి కంటే ఈ సారి భూగర్భజలాలు 5 మీటర్లు పైకి వచ్చాయి. దీంతో ఈసారి మరో 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని అగ్రికల్చర్ అంచనా వేస్తున్నారు.
వరి వైపు రైతుల మొగ్గు
యాసంగిలో కూడా వరి పంట వైపే రైతులు మొగ్గు చూపనున్నారు. నిరుడు వరి పంట 2. 05 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈసారి అనుకూల పరిస్థితులు ఉండటంతో 2,31,360 ఎకరాల్లో పంట సాగు అయ్యే వీలుందని అంచనా వేశారు. నిజాంసాగర్ , పోచారం కౌలాస్ నాలా ప్రాజెక్టులు, చెరువులు నిండుగా ఉన్నాయి. ప్రాజెక్టులు, చెరువుల కింద 75 వేల ఎకరాలు, బోర్ల కింద లక్షా 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వరి తర్వాత శనగ 95,282 ఎకరాలు, మక్క 40,540 ఎకరాలు, జొన్న 21,183, సన్ఫ్లవర్ 3,260, గోధుమ 3,702 , పప్పు దినుసులు 5వేలు, చెరుకు 7 వేల ఎకరాలు సాగు చేయనున్నారు.
అవగాహాన కల్పిస్తున్నాం
పంటల సాగుపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా సాగు నీరు సంవృద్ధిగా ఉంది. వరి పంటను ఎక్కువ మంది వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల యాసంగి సాగు షురూ అయ్యింది. ఎరువులు, విత్తనాలకు ప్రాబ్లమ్ లేదు.
- భాగ్యలక్ష్మి, అగ్రికల్చర్ జిల్లా ఆఫీసర్
వరి పంట వేస్త
రెండెకరాల భూమి ఉంది. బోరులో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దీంతో వరి పంట వేయటానికి రెడీ అవుతున్నా. వేరే పంట వేద్దామంటే కోతుల భయం ఉంది.
– రాములు, నాగిరెడ్డిపేట