
- పెండింగ్‌లో కెనాల్స్, టన్నెల్స్ పనులు
సిద్దిపేట, వెలుగు: యాసంగిలో వరి పంట సాగునీళ్లు లేక ఎండిపోతుండడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లందక పోవడంతో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట, కొండపాక మండలాల్లో వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. కండ్ల ముందే పంట ఎండిపోతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఎండిన పంట పశువులకు మేతగా మారుస్తున్నారు. కొందరు రైతులు ఖర్చులు భరిస్తూ ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి పొలం పారిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
డెడ్‌స్టోరేజీకి చేరిన తపాస్‌పల్లి రిజర్వాయర్
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి వద్ద 0.33 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించారు. దీని ఆయకట్టు 82 వేల ఎకరాలు. ఈ రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూరు మండలాల్లో 35 వేలు, కుడి కాల్వ ద్వారా కొమురవెల్లి, చేర్యాల మండలాల్లోని 48 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. రెండు ప్రధాన కాల్వల నుంచి 12 డిస్టిబ్యూటరీ కెనాల్స్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తారు.
ఈ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపాల్సి ఉన్నా అది జరగకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. జనగామ జిల్లా బొమ్మకూరు నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ కు నీటిని ఎత్తి పోయాల్సి ఉన్నా అక్కడ నీరు డెడ్ స్టోరేజీ చేరడంతో నీటిని తరలించే పరిస్థితి లేదు. ఇరవై రోజుల కింద రెండు రోజుల పాటు తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోశారు. రిజర్వాయర్ లోకి చేరిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడంతో చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలకు సాగు నీరందని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతుండడంతో తపాస్‌పల్లి రిజర్వాయర్ సమీపంలోని రైతులు డెడ్ స్టోరేజీ నీళ్లను పైప్ లైన్లు వేసుకుని తోడుకుంటూ వరి పంటను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
పెండింగ్ లో కాల్వ, టన్నెల్ పనులు
సీజన్ ప్రారంభానికి ముందే తపాస్‌పల్లి రిజర్వాయర్ లో నీళ్లు నిల్వ చేసి అవసరమైన సయయంలో విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగనాయక సాగర్ డీ 4 కెనాల్ నుంచి మద్దూరు మండలంలోని ఆరు గ్రామాలకు సాగు నీటిని అందించే ప్రయత్నాలను నంగునూరు మండలానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.330 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు కొండపాక, కొమురవెల్లి మండలాల్లో దాదాపు 25 కిలో మీటర్ల మేర కెనాల్, టన్నెల్స్ ద్వారా గోదావరి జలాలను తరలించడానికి ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించి కొంత మేర పనులు జరిగినా భూసేకరణ, పరిహారం సమస్య తేలకపోవడంతో రెండేళ్లుగా పనులు పెండింగ్ లో ఉన్నాయి.
ప్రభుత్వం ఆదుకోవాలి
యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన వరి కండ్ల ముందే ఎండుతోంది. చాలామంది ఎండిన పంటను పశువులకు మేతగా మారుస్తున్నారు. ప్రభుత్వం పంటలు ఎండిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
కొంతం ధర్మేందర్, రైతు చేర్యాల
కొమురవెల్లి మండలం ఐనాపూర్ కు చెందిన రైతు అల్దె స్వామి యాసంగిలో మూడెకరాల్లో వరి వేశాడు. పంట పొట్టకొచ్చే టైమ్ లో తపాసుపల్లి నుంచి నీళ్లు అందక పోవడం, బోర్లు ఎండిపోవడంతో రెండెకరాల పంట ఎండిపోయింది. దీంతో దానిని పశువులకు మేతగా మార్చాడు. ఇప్పుడు మిగిలిన ఎకరం సైతం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక్క స్వామి పరిస్థితి మాత్రమే కాదు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు అందక చాలామంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య.