యాదాద్రి జిల్లాలో క్రమంగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

  • గతేడాది 11 వేల ఎకరాల్లో సాగైతే ఈ సారి 1,730 ఎకరాలకే పరిమితం
  • 2.20 లక్షల ఎకరాలకు పెరగనున్న వరిసాగు

యాదాద్రి, వెలుగు : ఆరుతడి పంటల సాగుతో అనేక లాభాలు ఉంటాయని, రైతులు ఆ పంటలే సాగు చేయాలని ప్రభుత్వం, ఆఫీసర్లు చెబుతున్నా రైతులు ససేమిరా అంటున్నారు. ఆరుతడి పంటల సాగుకు, పంటను అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రైతులు ఆ పంటల సాగును క్రమంగా తగ్గించుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరుతడి పంటల విస్తీర్ణం మరింత తగ్గనుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అంచనా వేశారు. 

1730 ఎకరాల్లోనే...

ఆరుతడి పంటలు వేయడం సర్కారు చెప్పినంత ఈజీ కాదని రైతులు అంటున్నారు. అందుకే ఆ పంటల సాగు క్రమంగా తగ్గిపోతోంది. గతంలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు 11 వేల ఎకరాల్లో ఆ పంటలు  వేశారు. అయితే ఉత్పత్తులను అమ్ముకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు జిల్లాలో కోతులు, అడవి పందులు, నెమళ్ల బెడద ఎక్కువగా ఉంది. ఇబ్బందులు అధిగమించి పంట సాగు చేసినా ఉత్పత్తిని అమ్ముకోవడానికి భువనగిరి, తుంగతుర్తి, జనగామ మార్కెట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కష్టాలు పడలేక రైతులు ఆరుతడి పంటల సాగునే తగ్గించేస్తున్నారు. ఈ సారి జిల్లాలో కేవలం 1,730 ఎకరాల్లోనే ఆరుతడి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. 

2.20 లక్షల ఎకరాలకు పెరగనున్న వరి

యాదాద్రి జిల్లాలో 2020 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వరి సాగు క్రమంగా పెరుగుతోంది. పత్తి, కందులు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు సైతం వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా 3.01 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొడ్డురకం ఎక్కువగా సాగు చేయడంతో దిగుబడి కూడా పెరిగింది. కోతలు ఊపందుకోవడంతో వడ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నాయి. ఇప్పుడు రైతులు యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల దున్నకాలు సైతం ప్రారంభం అయ్యాయి. గత యాసంగిలో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగగా, ఈ సారి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు.