- జిల్లాలో వర్షాభావ పరిస్థితులే కారణం
- ఇప్పటికే అడుగంటుతున్న భూగర్భ జలాలు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో యాసంగి సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. వానలు సరిగ్గా కురవక పోవడంతో లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కూడా ఇప్పటికే అడుగంటుతున్నాయి. దీంతో చాలామంది రైతులు ఈ సారి రిస్క్ తీసుకోలేదు. నిరుడు సాగైన విస్తీర్ణంలో 60 వేల ఎకరాల ఏ పంటలు వేయకుండా వట్టిగనే వదిలేశారు.
4.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు
యాదాద్రి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగుకు అనుకూలంగా ఉంది. గడిచిన ఐదేండ్లుగా వానలు సకాలంలో కురియడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో 4.50 లక్షల ఎకరాల్లో తోటలు సహా వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. అనేక మంది రైతులు వరి సాగువైపు మళ్లడంతో లక్ష ఎకరాల నుంచి మూడు లక్షల ఎకరాలకు చేరింది.
గత వానాకాలం సీజన్‌లో మూడు లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. అయితే గతేడాది సెప్టెంబర్ నుంచి వానలు తగ్గుముఖం పట్టాయి. అవసరమైన సమయంలో వానలు పడకపోవడంతో దిగుబడి కూడా తగ్గింది.
తగ్గిన వర్షపాతం
జిల్లాలో ఎక్కువగా బోర్ల కిందనే వరి సాగు జరుగుతోంది. గత వానాకాలం సీజన్లో సరైన సమయంలో వానలు పడలేదు. గతేడాది జూన్ నుంచి జనవరి 2024 వరకూ సాధారణ వర్షపాతం 677.6 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా ఈసారి 651.8 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది.
గతేడాది వర్షపాతంతో పోలిస్తే ఈసారి 28 మిల్లీ మీటర్లు తగ్గింది. దీంతో 2022 డిసెంబర్ నాటికి 3.97 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2023 డిసెంబర్ నాటికి 6.04 మీటర్ల లోతుకు తగ్గి 2.07 మీటర్ల వత్యాసం ఏర్పడింది. దీంతో బోర్ల నుంచి పంటకు సరిపడా నీరు అందదని గుర్తించిన రైతులు ఈసారి వరి నుంచి తప్పుకున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఈ సారి 2.40 లక్షల ఎకరాల్లో
గత యాసంగిలో సీజన్‌లో 1.50 లక్షల మంది రైతులు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి మాత్రం 2.40 లక్షల ఎకరాల్లోనే వరిని సాగు చేస్తున్నారు. ఇప్పటివరకూ లక్ష ఎకరాల్లో రైతులు నాట్లు వేయగా.. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే దున్నకాలు పూర్తి అయ్యాయి. సాగు చేస్తున్న రైతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కాగా ఇప్పటివరకూ 70 ఎకరాల్లో కూరగాయలు పండిస్తుండగా మిర్చి కేవలం 7 ఎకరాలు, పల్లి 16, ఉలవలు, పెసర్లు 4 చొప్పున, ఇతర పంటలు మరో 30 ఎకరాల్లో సాగు చేశారు.
వానలు కురవకపోవడంతోనే..
యాసంగి సీజన్లో ఈసారి వరి సాగు తగ్గుతోంది. గత యాసంగి, వానకాలంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. గతేడాది చివరి నుంచి వానలు సరిగా కురవలేదు. దీంతో ఈసారి 2.40 లక్షల ఎకరాల్లోనే వరి సాగు చేస్తున్నారు.
- అనురాధ, డీఏవో, యాదాద్రి