- వారం రోజుల నుంచి విడవకుండా వానలు
- సోయా, మక్కజొన్న ఇతర అరుతడి పంటలకు ప్రయోజనం
- 75 శాతం వరి నాట్లు పూర్తి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు జోరందుకున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 శాతం మేర నాట్లు కంప్లీట్ అయ్యాయి. జూన్‌లో సాధారణ వర్షాలు కూడా పడకపోవడం, జులై10 వరకు వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వర్షాలు పడకపోవడంతో వరినాట్లు లేటవుతున్నాయని పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జులై 10 వ తేదీ నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. దీంతో జిల్లాలో వరి నాట్లతో పాటు, సోయా, మొక్కజొన్న పంటలకు కూడా ప్రాణం పోసినట్లయింది.
-
ఖరీఫ్ లో 4.30 లక్షల ఎకరాల సాగు అంచనా
జిల్లాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా ఈ ఖరీఫ్‌లో 4.30 లక్షల ఎకరాల్లో వరి వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొన్నటివరకు వర్షాల కొరత వల్ల బోర్ల కింద ఉన్న పొలాల్లో ఈ నెల15 నాటికి కేవలం1.29 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. వర్షాలు దంచి కొట్టడంతో 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముగిశాయి.
-
మిగిలిన పంటలకు వానలతో మేలు
జిల్లాలో వాణిజ్య పంటలు కూడా విరివిగా పండిస్తారు. 34,700 ఎకరాలలో సోయాబీన్, 25,569 ఎకరాల పండ్ల తోటలు, 24, 662 ఎకరాల పసుపు. 860 ఎకరాల కంది, మినుము, పెసర్లు, 455 ఎకరాల ఆయిల్‌పాం తదితర పంటలు కలిపి 5.52 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. రెండు వారాల క్రితం చెరువుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 967 చెరువుల్లోకి కొత్తగా నీరు వచ్చి
చేరుతోంది.
-
దోమపోటుతో జాగ్రత్త
ఈ పది రోజుల్లో వ్యవసాయ పనులు వేగం పుంజుకున్నాయి. బోర్ల కింద వేసిన వరి, సోయా పంటలు వర్షాలతో కోలుకున్నాయి. దోమపోటు భయం కనబడుతోంది. రైతులు అలర్ట్‌గా ఉండి వ్యవసాధికారుల సూచనలు పాటించాలి.
- వాజీద్ హుస్సేన్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్