యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో కంటే పదింతల పంట ఎక్కువగా పండిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది మంత్రం వేసి మ్యాజిక్ చేస్తే పండలేదని, కేసీఆర్ అనే అద్భుత దీపం కారణంగా పండుతోందని అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో జరిగిన బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరిగిందన్నారు. కేసీఆర్ కారణంగా రైతుతో పాటు భూమి విలువ కూడా పెరిగిందని చెప్పారు. డబుల్ఇంజన్సర్కార్అమలు చేయని స్కీమ్‌లను బీఆర్ఎస్సర్కార్అమలు చేస్తోందని తెలిపారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీలు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ చేసే గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందని, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టెన్త్ పేపర్ లీకు చేసి పిల్లల జీవితాలతో ఆడుకొని బీజేపీ దివాళకోరు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీని ఉసిగొల్పి బెదిరింపులు, ఎమ్మెల్యేలను కొనడం చేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో గన్ కల్చర్ ఉందంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అగ్రికల్చర్ ఉందని తెలిపారు. మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది ‘నా చేతిలో మైక్ లాగిన వ్యక్తి చేతిలో ఇప్పుడు మైకే లేకుండా పోయింది’ అని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు.
లోకల్ లీడర్లు మాట్లాడలే..
సమ్మేళనంలో బీఆర్ఎస్ లోకల్ లీడర్లకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి దీటుగా మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజుతో పాటు వ్యతిరేక వర్గం పని చేస్తోంది. ఈ పరిస్థితుల్లో లోకల్ లీడర్లకు మాట్లాడితే గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో చాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికి తోడు సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డుమ్మా కొట్టారు. ఈయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాకపోవడంతో కొంత అలకతో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, దేవీ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పార్టీ లీడర్లు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు.
మెడికల్ హబ్‌గా తెలంగాణ
చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో వంద పడకల ఆసుపత్రికి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడకముందు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం చౌటుప్పల్‌లో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వైద్యం గురించి రూ. 1300 కోట్ల పనులు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రం వచ్చాక 4 మెడికల్ కాలేజీ లు ఇస్తే అందులో రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేటకే ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించే తొమ్మిది మెడికల్ కాలీజీలతో వీటి సంఖ్య మొత్తం 55కు సంఖ్య చేరుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 102 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018లో స్థలం కేటాయిస్తే ఈ మధ్య ప్రధాని భూమి పూజ చేశారని, ఎయిమ్స్ పై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ పమేలా సత్పతి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు ఉన్నారు.