- అందులో 21.35 లక్షల ఎకరాల్లో వేసిన వరి నాట్లు
- 5.68 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్న రైతులు
- రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో రైతన్నలు వరి సాగుకే జై కొడుతున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున వరి నాట్లు వేస్తున్నారు. రైతాంగం ఇప్పటికే 21.35లక్షల ఎకరాలకు పైగా వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 32 జిల్లాల్లో 33.92లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరగగా.. అందులో వరి 70 శాతం సాగైనట్టు తాజా వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగి చెరువుల్లో, బావుల్లో నీరు ఉండడంతో రైతులు వరి సాగు పైనే ఫోకస్ పెట్టారు. దీంతో ఈయేడు వరి సాగు గణనీయంగా పెరిగి రికార్డు స్థాయిలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్‌అంటున్నరు. యాసంగిలో రైతులు వరి, మొక్కజొన్న, పప్పుశనగ, వేరుశనగ పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వ్యవసాయశాఖ నివేదికలో స్పష్టమైంది.
వానాకాలం సాగును మించి నాట్లు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 21లక్షల ఎకరాలకు పైగా వరి నాట్లు వేశారు. యాసంగి సాధారణ సాగు 47.27లక్షల ఎకరాలు కాగా.. 2023–24 యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇదే యాసంగిలో ఆల్టైమ్రికార్డు. గడిచిన వానాకాలంలోనూ రైతులు అత్యధికంగా రికార్డు స్థాయిలో 67.78లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇదే రాష్ట్రంలో ఒక సీజన్‌లో అత్యధిక వరిసాగు కావడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈయేడు యాసంగిలో వరి.. వానాకాలం మించి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు. సర్కారు బోనస్‌తో యాసంగి కొనుగోళ్లు చేస్తుందనే నమ్మకంతో సన్నవడ్లు వేస్తున్నమని రైతులు చెబుతున్నారు.
వరిలో సూర్యాపేట జిల్లా టాప్..
ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఒక్క వరినాట్లే 3.09 లక్షల 251 ఎకరాల్లో వేశారు. ఇప్పటిదాకా ఇదే టాప్ కాగా..వరినాట్ల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత నిజామాబాద్‌లో 3.02లక్షల ఎకరాల్లో వరినాట్లు జరిగాయి. నల్గొండలో 2.12లక్షల ఎకరాల్లో , సిద్ధిపేట జిల్లాలో 2.04లక్షల ఎకరాలు, యాదాద్రిలో 1.54లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.52లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జగిత్యాలలో 1.15లక్షల ఎకరాలు, జనగాంలో 92వేల ఎకరాల్లో, కరీంనగర్‌లో 89వేల ఎకరాల్లో , సిరిసిల్ల జిల్లాలో 89వేల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలో తేలింది.
పంటల సాగులో నిజామాబాద్..
ఈ సీజన్‌లో పంటల సాగులో నిజామాబాద్ టాప్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ జిల్లాలో యాసంగి సాగు 3.80లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తరువాత సూర్యాపేట జిల్లాలో పంటల సాగు 3.09లక్షల 939 ఎకరాల్లో, కామారెడ్డి 2.69లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. నల్గొండలో 2.35లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 2.34 లక్షల ఎకరాలు, నాగర్ కర్నూల్లో 1.67లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 1.57లక్షల ఎకరాలు, యాదాద్రిలో 1.55లక్షల ఎకరాలు, జగిత్యాలలో 1.50 లక్షల ఎకరాల్లో , ఖమ్మం జిల్లాలో 1.42లక్షల ఎకరాలు, వరంగల్‌లో 1.13లక్షల ఎకరాలు, కరీంనగర్‌లో 1.02 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరిగింది.
అత్యల్పంగా మేడ్చల్‌జిల్లాలో 3389 ఎకరాల్లో , తరువాత ములుగులో 6,965 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో 10,249ఎకరాల్లో మాత్రమే యాసంగి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలో తేలింది.
మిగతా పంటలు అంతంతే..
యాసంగి పంటల్లో మిగతా పంటలు అంతంత మాత్రంగానే సాగు జరుగుతోంది. వరి తరువాత మక్కలు 5.68లక్షల ఎకరాల్లో సాగు చేయగా .. పల్లి పంట 2.21లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. పప్పు శనగలు (బెంగాల్‌గ్రామ్) 2.13లక్షల ఎకరాల్లో వేశారు.
వీటి తరువాత జొన్నలు 1.33లక్షల ఎకరాల్లో, మినుములు 40 వేల ఎకరాల్లో సాగు కాగా, పొద్దు తిరుగుడు 11,253 ఎకరాల్లో, సాఫ్ ప్లవర్ 6280 ఎకరాల్లో, ఆయిల్ సీడ్స్ 2.39లక్షల ఎకరాల్లో సాగు చేయగా, పప్పు దినుసులు 2.66లక్షల ఎకరాల్లో వేశారు. మిగతా పంటలు 32వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అగ్రికల్చర్ నివేదికలో స్పష్టమైంది.